బుల్లెట్ ట్రైన్ తో మ‌న‌కు ప‌నేంటి?

shiv sena comments on bullet train

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

కేంద్ర‌ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై ప్ర‌తిప‌క్షాల క‌న్నా ముందుగా బీజేపీ మిత్ర‌పక్షం శివ‌సేన విమ‌ర్శ‌లు గుప్పిస్తోంది. జ‌పాన్ ప్ర‌ధాని షింజో అబే భార‌త ప‌ర్య‌ట‌న‌లో బుల్లెట్ ట్రైన్ ప్రారంభ ప‌నుల‌కు శంకుస్థాప‌న చేసిన నేప‌థ్యంలో శివ‌సేన త‌న ప‌త్రిక సామ్నాలో దీనిపై ఓ క‌థ‌నం ప్ర‌చురించింది. బుల్లెట్ రైలు ప్రాజెక్టును ఒక అన‌వ‌స‌ర‌మైన ప్రాజెక్టుగా శివ‌సేన ఆ క‌థ‌నంలో అభివ‌ర్ణించింది. ఈ ట్రైన్ ను తీసుకురావాల్సిన అవ‌స‌రం అస‌లు ఉందా అని ప్ర‌శ్నించింది. భార‌తీయ రైల్వే, ముంబై లోక‌ల్ ట్రైన్లు ప్ర‌తిరోజూ ఎన్నో స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్నాయ‌ని, ఇలాంటి ప‌రిస్థితుల్లో బుల్లెట్ రైలు వ‌ల్ల ఎలాంటి ఉప‌యోగం లేద‌ని శివ‌సేన అభిప్రాయ‌ప‌డింది. ఇది సామాన్యుల కోసం చేప‌ట్టిన ప్రాజెక్టు కాద‌ని, సంప‌న్న‌, బిజినెస్ క్లాసు వ‌ర్గాల కోసం భారీ వ్య‌యంతో నిర్మిస్తున్నార‌ని ఆ పార్టీ మండిప‌డింది. రుణాలు మాఫీ చేయ‌మ‌ని రైతులు వేడుకుంటోంటే… ప‌ట్టించుకోని మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం బుల్లెట్ రైలు ప్రాజెక్టు కు వేల కోట్లు కుమ్మ‌రిస్తోంద‌ని ఆరోపించింది. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుతో రైతులు జీవనాధారం కోల్పోతున్నార‌ని ఆందోళ‌న వ్య‌క్తంచేసింది. ప్రాజెక్టుకోసం కేంద్ర ప్ర‌భుత్వం రూ.

1.08 ల‌క్ష‌ల కోట్లు ఖ‌ర్చుచేస్తోంద‌ని, మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం రూ. 30వేల కోట్లు వెచ్చిస్తోంద‌ని తెలిపింది. కార్మికుల‌తో స‌హా కావాల్సిన వ‌న‌రుల‌న్నీ జ‌పాన్ ఇస్తోంటే… నిధులు, స్థ‌లం మాత్రం మహారాష్ట్ర‌, గుజ‌రాత్ ప్ర‌భుత్వాలు ఇస్తున్నాయని, ఘ‌న‌త మాత్రం జ‌పాన్ కు వెళ్తోంద‌ని విశ్లేషించింది. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుతో జపాన్ భార‌త్ ను దోచుకుంటోంద‌ని మండిప‌డింది. మిత్రపక్షంగా ఉంటున్న‌ప్ప‌టికీ కొన్ని విష‌యాల్లో శివ‌సేన బీజేపీపైనా… ప్ర‌ధాన‌మంత్రి మోడీపైనా తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తోంది. మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో రెండు పార్టీల మ‌ధ్య ఏర్ప‌డ్డ విభేదాలు… అప్ప‌టినుంచీ కొన‌సాగుతూనే ఉన్నాయి. ఆ క్ర‌మంలోనే శివ‌సేన బుల్లెట్ ట్రైన్ పై త‌న అభిప్రాయాన్ని నిర్మొహ‌మాటంగా వ్య‌క్తంచేసింది.