వర్షంలో తడుస్తూనే హోటల్ బయట ఎదురు చూస్తున్న శివ కుమార్

shiva kumar waiting outside of the hotel in rain

ముంబైలోని ఓ హోటల్ లో మకాం వేసిన రెబల్ ఎమ్మెల్యేలను కలవకుండా తాను కదిలేది లేదని తేల్చి చెబుతున్న కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్, భారీ వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా హోటల్ బయటే ఉన్నారు. ఈ ఉదయం నుంచి హోటల్ ముందు హై డ్రామా నడుస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర రాజకీయాల్లో ఎటువంటి సంక్షోభం ఏర్పడినా, పరిష్కరించగల సత్తా ఉన్న నేతగా పేరున్న శివకుమార్, ఈ ఉదయం హోటల్ లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. లోపల ఉన్న ఎమ్మెల్యేలు కోరితేనే శివకుమార్ ను పంపిస్తామని పోలీసులు ఖరాకండీగా చెప్పారు. మరోవైపు లోపలున్నవారిని సంప్రదించేందుకు కాంగ్రెస్ నేతల ప్రయత్నాలు ఫలించడం లేదు. రెబల్ ఎమ్మెల్యేలను కలవాల్సిందేనని పట్టుబట్టిన శివకుమార్, తాను ముంబైకి ఒక్కడినే వచ్చానని, బీజేపీ కార్యకర్తల నినాదాలకు భయపడేవాడిని కాదని చెబుతున్నారు. తాను హోటల్ లో గదిని బుక్ చేసుకుంటే, దాన్ని కూడా రద్దు చేశారని ఆయన ఆరోపించారు. వర్షం పడుతున్నా ఆయన కదలకుండా ఉండడం ఆసక్తికరంగా మారింది.