ప్ర‌తీకార‌మే ఆయ‌న జీవితం…

Shoojit Sircar wants to make Udham Singh Biopic

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

దేశ స్వాంతంత్య్రం కోసం చాలా మంది ప్రాణ‌త్యాగాలు చేశారు. కానీ వారిలో కొంద‌రికే గుర్తింపు వ‌చ్చింది. జీవితం మొత్తం దేశానికే వెచ్చించినా… కొంద‌రిని చరిత్ర ప‌ట్టించుకోలేదు. అలాంటి వారిలో గ‌ద‌ర్ పార్టీకి చెందిన‌ ఉద్ద‌మ్ సింగ్ ఒక‌రు. నిజానికి ఆయ‌న్ని చ‌రిత్ర త‌ప్ప‌కుండా గుర్తుంచుకోవాలి. ఎందుకంటేభార‌త స్వాతంత్రోద్య‌మ చ‌రిత్రలోనే అత్యంత అమాన‌వీయ ఘ‌ట‌న అయిన జ‌లియన్ వాలాబాగ్ దురాగ‌తంపై ప్ర‌తీకారం తీర్చుకున్న ఏకైక స‌మ‌ర‌యోధుడాయ‌న‌. నిజానికి ఆ దారుణం ఆనాటి భారతీయులనెంద‌రినో క‌దిలించి వేసింది. ప్ర‌జ‌ల్లో తీవ్రస్థాయిలో ఆగ్ర‌హావేశాలు వ్య‌క్త‌మ‌య్యాయి. బ్రిటిష్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా పోరాడేందుకు ల‌క్ష‌లాదిగా భార‌తీయులు త‌ర‌లివ‌చ్చారు. స్వాతంత్రోద్య‌మ తీరుతెన్నులు ఒక్క‌సారిగా కొత్త‌రూపు తీసుకున్నాయి. అయితే కాల‌క్ర‌మంలో అన్ని విష‌యాల్లానే ఈ దారుణమూ నెమ్మ‌దిగా భార‌తీయుల జ్ఞాప‌కాల్లో చేరిపోయింది. మ‌నిషి స్వ‌భావ‌మే అంత‌. ఒకప్పుడు తీవ్ర ఆవేద‌న, దుఃఖం క‌లిగించిన విష‌యాలు త‌ర్వాతిరోజుల్లో మ‌నసు అట్ట‌డుగు పొర‌ల్లోకి చేరిపోతాయి.

జ‌లియ‌న్ వాలాబాగ్ దురాగ‌తాన్ని ఆనాటి ప్ర‌జ‌ల్లో ఏ ఒక్క‌రూ మ‌ర్చిపోలేదు కానీ… ఆ ఘ‌ట‌న జ‌రిగిన‌ప్ప‌టితో పోలిస్తే… క‌లిగిన ఆగ్ర‌హం రోజులు, సంవ‌త్స‌రాలు గ‌డిచే కొద్దీ త‌గ్గిపోయింది. అంద‌రూ ఎవ‌రి దైనందిన జీవితంలో వారు ప‌డిపోయారు. కానీ ఉద్ద‌మ్ సింగ్ మాత్రం త‌న కోపాగ్నిని చ‌ల్లార్చుకోలేదు. వ్య‌క్తిగ‌త జీవితంకోసం త‌న ఆగ్ర‌హాన్ని ప‌క్క‌న‌పెట్ట‌లేదు. మూడువేల‌మంది అమాయ‌కుల ప్రాణాలు బ‌లిగొన్న జ‌న‌ర‌ల్ డ‌య్య‌ర్ పై ప్ర‌తీకారం తీర్చుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు.. రోజులు గ‌డిచే కొద్దీ ఆ ప్ర‌తీకార జ్వాల అంత‌కంత‌కూ పెరుగుతూ వ‌చ్చిందే కానీ ఏ మాత్రం త‌గ్గ‌లేదు. సంవ‌త్సరాలు వేచి చూసి మ‌రీ దేశ ప్ర‌జ‌లంద‌రి త‌ర‌పున జ‌న‌ర‌ల్ డ‌య్య‌ర్ కు శిక్ష అమ‌లు చేశారు. అనంత‌రం బ్రిటిష్ ప్ర‌భుత్వం ఏక‌ప‌క్షంగా అమ‌లు చేసిన ఉరిశిక్షను న‌వ్వుతూ అనుభ‌వించారు. చ‌రిత్ర‌లో స‌రైన స్థానం ద‌క్కించుకోని ఉద్ద‌మ్ త‌న జీవితం మొత్తం డ‌య్య‌ర్ మీద ప‌గ‌తోనే గ‌డిపారు.

1919 ఏప్రిల్ 13న ఓ స‌మావేశం కోసం పెద్ద ఎత్తున త‌ర‌లివ‌చ్చిన ప్ర‌జ‌లు కొన్నిక్ష‌ణాల్లోనే డ‌య్య‌ర్ ఏక‌ప‌క్ష ఆదేశాల ఫ‌లితంగా సైనికులు జ‌రిపిన విచక్ష‌ణార‌హిత కాల్పుల్లో విగ‌త‌జీవులుగా ప‌డిఉండ‌డం చూసిన ఉద్ద‌మ్ చ‌లించిపోయారు. తుపాకుల్లోని మందుగుండు సామాగ్రి పూర్త‌యిందాకా డ‌య్య‌ర్ సాగించిన న‌ర‌మేధం ఉద్ద‌మ్ జీవితాన్ని మార్చివేసింది. అప్పుడాయ‌న వ‌య‌సు స‌రిగ్గా 20 ఏళ్లు. డ‌య్య‌ర్ ను ఎలాగైనా చంపాల‌నే ప‌గ‌తో ఉద్ద‌మ్ బ్రిటిష్ వారి క‌న్నుగ‌ప్పి కాశ్మీర్ వెళ్లారు. అక్క‌డి నుంచి జ‌ర్మ‌నీ చేరుకున్న ఆయ‌న, త‌ర్వాత ఒక కూలీగా లండ‌న్ లో ప్ర‌వేశించారు. రోజంతా శ్ర‌మిస్తూ, తిండి కూడా తిన‌కుండా సొమ్ముదాచి ఒక రివాల్వ‌ర్ కొనుగోలు చేశారు. జ‌న‌ర‌ల్ డ‌య్య‌ర్ క‌ద‌లిక‌లు గ‌మ‌నిస్తూ ప్లాన్ వేశారు. మార్చి 13, 1940న డ‌య్య‌ర్ ఈస్ట్ ఇండియా కంపెనీలో ప్ర‌సంగిస్తుండ‌గా ఆయ‌న‌పై కాల్పులు జ‌రిపి దేశ ప్ర‌జ‌లంద‌రి త‌ర‌పునా ప్ర‌తీకారం తీర్చుకున్నారు. ఇది జ‌రిగింది. 1940 మార్చి 13న. అప్పుడు ఉద్ధ‌మ్ వ‌య‌సు 41 ఏళ్లు. అంటే 21 సంవ‌త్స‌రాలు పాటు ఉద్ధ‌మ్ త‌న ప‌గ‌ను మ‌ర్చిపోలేదు. డ‌య్య‌ర్ ను కాల్చిచంపాల‌న్న త‌న ల‌క్ష్యాన్ని వ‌దిలిపెట్ట‌లేదు. డ‌య్య‌ర్ పై కాల్పులు జ‌రిపిన‌ త‌ర్వాత బ్రిటిష్ పోలీసులు ఆయ‌న్ను అరెస్టు చేసిన‌ప్పుడు ఉద్ద‌మ్ ఈ విష‌యాన్నే వెల్ల‌డించారు.

త‌న ప‌గ తీర్చుకునేందుకు 21 సంవ‌త్స‌రాలుగా ఎదురుచూస్తున్నాన‌ని, ఎట్ట‌కేల‌కు త‌న ల‌క్ష్యం నెర‌వేరింద‌ని సంతోషం వ్య‌క్తంచేశారు. తాను చావు గురించి భ‌య‌ప‌డ‌డం లేద‌ని, త‌న దేశం కోసం ప్రాణ‌త్యాగం చేయ‌డం కన్నా మించిన‌ది ఏదీ లేద‌ని వాంగ్మూలం ఇచ్చారు. డ‌య్య‌ర్ ను కాల్చిచంపినందుకు గానూ, బ్రిటిష్ ప్ర‌భుత్వం జూలై 31, 1940న ఉద్ద‌మ్ సింగ్ ను ఉరితీసింది. త‌న జీవిత‌కాలం మొత్తాన్ని, ప్రాణాన్నీ కూడా దేశం కోసం అర్పించిన ఉద్ధ‌మ్ సింగ్ జీవితం గురించి ఇప్ప‌టివారికి చాలామందికి తెలియ‌దు. అస‌లు నేటిత‌రం దేశ‌పౌరులు చాలా మంది ఆయన పేరు కూడా వినిఉండ‌రు. చ‌రిత్ర‌లో నిలిచిపోవాల్సిన ఓ స‌మ‌ర‌యోధుడు… ఇంత‌గా నిర్లక్ష్యానికి గుర‌వ‌డం ప్ర‌ముఖ బాలీవుడ్ ద‌ర్శ‌కుడు సూజిత్ స‌ర్కార్ ను క‌లిచివేసింది. అందుకే ఉద్ధ‌మ్ సింగ్ జీవితాన్ని తెర‌కెక్కించేందుకు నడుంక‌ట్టారు. ఉద్ద‌మ్ పాత్ర‌ను ర‌ణ్ బీర్ క‌పూర్ చేయ‌నున్నాడ‌ని బాలీవుడ్ వ‌ర్గాలు అంటున్న‌ప్ప‌టికీ… ఆ ప్ర‌చారాన్ని సూజిత్ ఖండించాడు. ర‌ణ్ బీర్ ఇందులో న‌టించ‌డం లేద‌ని, త్వ‌రలోనే న‌టీన‌టుల జాబితాను విడుద‌ల చేస్తాన‌ని తెలిపాడు. సూజిత్ ప్ర‌య‌త్నాన్నిప‌లువురు హ‌ర్షిస్తున్నారు. ఈ సినిమా ద్వారా ఉద్ద‌మ్ సింగ్ గురించి నేటి త‌రం తెలుసుకోనే వీలుంద‌ని సంతోషం వ్య‌క్తంచేస్తున్నారు.