వైసీపీలోకి సినీనటుడు శివాజీరాజా ?

reason behind Sivaji Raja's resignation for 'Ma'

సీనియర్ సినీనటుడు, మావీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) మాజీ అధ్యక్షుడు శివాజీరాజా రాజకీయాల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. ఆయన త్వరలోనే వైసీపీలో చేరనున్నట్లు ఫిల్మ్‌నగర్ వర్గాల సమాచారం. వైసీపీ అధినేత జగన్‌ను కలిసేందుకు శివాజీరాజా ఈరోజు అపాయింట్‌మెంట్ కోరినట్లు సమాచారం. శివాజీరాజా పొలిటికల్ ఎంట్రీపై ఫిల్మ్ నగర్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఈ వార్తపై శివాజీరాజా నుంచి ఎలాంటి సమాచారం లేదు. ఈ వార్త నిజమో? కాదో? తెలియాలంటే ఈరోజు సాయంత్రం దాకా వేచి చూడాల్సింది. ఇప్పటికే సీనియర్ నటి జయసుధ, కమెడియన్లు అలీ, పృథ్వీ, పోసాని కృష్ణమురళి, కృష్ణుడు, భానుచందర్ లాంటి తారలు వైసీపీలో చేరారు. వారి బాటలోనే శివాజీరాజా కూడా పయనించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ‘మా’ ఎన్నికల్లో శివాజీరాజా ప్యానెల్‌పై నరేష్ ప్యానెల్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. రాజకీయ ఎన్నికలను తలపించేలా శివాజీరాజా, నరేష్ ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసుకున్నారు. ఉత్కంఠగా సాగిన ఎన్నికల్లో నరేష్ విజయం సాధించారు. అయితే ఎన్నికలు ముగిసినా శివాజీరాజా ‘మా’ పగ్గాలు తనకు అప్పగించకుండా వేధిస్తున్నారంటూ నరేష్ ఆరోపిస్తున్నారు. అయితే నాగబాబుకు కూడా రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు, నిన్న నాగబాబు నరసాపురం ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న సమయంలో ఇప్పుడు శివాజీ రాజా జగన్ పార్టీలో చేరుతుండడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.