పాము కారణంగా రోడ్డు ప్రమాదం

పాము కారణంగా రోడ్డు ప్రమాదం

పాము కారణంగా రోడ్డు ప్రమాదం జరిగి ఒకరు ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన తమిళనాడులోని మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. చెన్నై- తిరుచ్చి జాతీయ రహదారిపై హఠాత్తుగా తాచు పాము రావడంతో ఓ లారీ డ్రైవర్ హఠాత్తుగా నిలిపివేశాడు. దీంతో వెనుక నుంచి వచ్చిన వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. విల్లుపురం సమీపంలో జరిగిన ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆటో డ్రైవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.

ప్రమాదంలో గాయపడిన ఇద్దరు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. విల్లుపురం సమీపంలోని పెరంగియార్ వద్ద జాతీయ రహదారికి ఓ వైపు నుంచి మరో వైపునకు తాచుపాము వెళ్లేందుకు ప్రయత్నించడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. హఠాత్తుగా ముందు వెళ్తున్న వాహనాలు ఆగిపోవడంతో వెనుక నుంచి వేగంగా వస్తున్న పలు వాహనాలు ఒకదానికొకటి ఢీకొట్టాయి.

ఈ క్రమంలో తమిళనాడు రోడ్డు రవాణాకు చెందిన బస్సు రహదారి పక్కనే ఏర్పాటుచేసిన హోర్డింగ్‌ను ఢీకొంది.ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహయక చర్యలు ప్రారంభించారు. ట్రాఫిక్‌ను క్లియర్ చేసి, క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అటు, పామును చూసేందుకు వాహనాల్లోని వారు ఎగబడ్డారు. ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు.