జియా ఖాన్ ఆత్మ‌హ‌త్య‌కు సూరజ్ పంచోలీనే కార‌ణం

sooraj pancholi behind Jiah Khan suicide

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఐదేళ్ల క్రితం సంచ‌ల‌నం సృష్టించిన హీరోయిన్ జియా ఖాన్ ఆత్మ‌హ‌త్య కేసులో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో యువ హీరో సూరజ్ పంచోలీ ముమ్మాటికీ నిందితుడేన‌ని ముంబై సెష‌న్స్ కోర్టు స్ప‌ష్టంచేసింది. అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్..ఆత్మ‌హ‌త్య‌కు ప్రేరేపించిన నేరం కింద ఫిబ్ర‌వ‌రి 14 నుంచి సూర‌జ్ ను విచారించ‌నుంది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇలా ఉన్నాయి..అమితాబ్, రాంగోపాల్ వ‌ర్మ నిశ్శ‌బ్ద్ సినిమాతో బాలీవుడ్ కు ప‌రిచ‌య‌మయింది జియా ఖాన్…తొలి సినిమాతో ఆమెకు దేశ‌వ్యాప్తంగా గుర్తింపు వ‌చ్చింది. గ‌జిని, హౌస్ ఫుల్ వంటి చిత్రాల్లో అవ‌కాశాలు చేజిక్కించుకుంది. ఈ క్ర‌మంలో న‌టుడు ఆదిత్య పంచోలీ కుమారుడు సూర‌జ్ పంచోలీతో జియా ప్రేమ‌లో ప‌డింది. వారిద్ద‌రూ స‌హ‌జీవ‌నం కూడా చేశారు. అయితే 2013 జూన్ 3న ముంబై జూహులోని త‌న ఫ్లాట్ లో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆమె ఆత్మ‌హ‌త్య చేసుకుంది.

జియా ఆత్మ‌హ‌త్య బాలీవుడ్ లో తీవ్ర సంచ‌ల‌నం సృష్టించింది. త‌న కూతురుది ఆత్మ‌హ‌త్య కాద‌ని… సూరజ్ పాంచోలీ ప్రేరేపించి చేసిన హ‌త్య అని జియా త‌ల్లి రుబియా ఖాన్ ఆరోపించింది. కేసు న‌మోదు చేసిన ముంబై పోలీసులు సూరజ్ పాంచోలీపై విచార‌ణ జ‌రిపారు. ఆమెది ఆత్మ‌హ‌త్యేన‌ని, సూర‌జ్ ప్ర‌మేయంలేద‌ని ఛార్జ్ షీట్ దాఖ‌లు చేశారు. దీనిపై ప‌లు అనుమానాలు వ్య‌క్తంచేసిన రుబియా బాంబే హైకోర్టును ఆశ్ర‌యించారు. దీంతో హైకోర్టు కేసును సీబీఐకి బ‌దిలీ చేసింది. రంగంలోకి దిగిన సీబీఐ అనేక కోణాల్లో ద‌ర్యాప్తు చేసి కీల‌క విష‌యాలు రాబ‌ట్టింది. జియాది ఆత్మ‌హ‌త్యేన‌ని తేల్చిన సీబీఐ అందుకు ప్రేరేపించింది మాత్రం సూర‌జ్ పాంచోలీనే అని వెల్ల‌డించింది. ప‌లు సంచ‌ల‌న విష‌యాల‌తో ఛార్జ్ షీట్ దాఖ‌లు చేసింది. జియా-సూర‌జ్ లు స‌హ‌జీవ‌నం చేయ‌డం, ఆ క్ర‌మంలో ఆమె గ‌ర్భం దాల్చ‌డం, బ‌ల‌వంతంగా చేయించిన అబార్ష‌న్ విక‌టించ‌డం వంటి విష‌యాల‌ను ఛార్జిషీట్లో సీబీఐ పూస‌గుచ్చిన‌ట్టు వివ‌రించింది. సూర‌జ్ తో స‌హ‌జీవ‌నం చేసిన జియా పూర్తిస్థాయి గృహిణి బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించింద‌ని తెలిపింది.

సూర‌జ్ దుస్తులు ఉత‌క‌డం, వాటిని ఇస్త్రీ చేయ‌డం, అత‌నికి వంట చేసి పెట్ట‌డం, ఇల్లు తుడ‌వ‌డం, ఇలా అత‌నికి, ఇంటికి సంబంధించిన అన్ని ప‌నులు చేసేద‌ని తెలిపింది. సూర‌జ్ తో స‌హ‌జీవ‌నం వ‌ల్ల జియా గ‌ర్భం దాల్చిందని సీబీఐ ఛార్జ్ షీట్ లో పేర్కొంది. సీబీఐ స‌మ‌ర్పించిన ఆధారాల్లో ఫ్యామిలీ డాక్ట‌ర్ ఇచ్చిన స్టేట్ మెంట్ కీల‌కంగా మారింది. జియా నాలుగు నెల‌ల గ‌ర్భాన్ని సూరజ్ బ‌ల‌వంతంగా తొల‌గించిన‌ట్టు నిర్ధార‌ణ అయింది. ఓ రోజు సూరజ్ డాక్ట‌ర్ కు ఫోన్ చేసి జియా..పిల్స్ వేసుకుంద‌ని, అయితే అబార్ష‌న్ పూర్తిగా జ‌ర‌గ‌లేద‌ని, స‌గం స్ట‌ఫ్ ఆమె క‌డుపులోనే ఉండిపోయింద‌ని చెప్పిన‌ట్టు ఫ్యామిలీ డాక్ట‌ర్ స్టేట్ మెంట్ ఇచ్చారు. ఆ త‌ర్వాత వారు ఆస్ప‌త్రికి వ‌చ్చి చికిత్స తీసుకున్నార‌ని తెలిపారు. జియా త‌న సూసైడ్ నోట్ లోనూ అబార్ష‌న్ విష‌యాన్ని ప‌దే ప‌దే ప్ర‌స్తావించింది. నన్ను నీకు పూర్తిగా స‌మ‌ర్పించుకున్నాను. కానీ నువ్వు న‌న్ను అనుక్ష‌ణం బాధ‌పెట్టావు. నా అణువ‌ణువూ నాశ‌నం చేశావు.

నాలో పెరుగుతున్న నీ బిడ్డ‌ను చంపుకోవాల్సి వ‌చ్చిన‌ప్పుడు ఎంత క్షోభ‌ప‌డ్డానో నీకు అర్ధం కాదు అని జియా ఆవేద‌న వ్య‌క్తంచేసింది. సీబీఐ ఛార్జ్ షీట్ ను ప‌రిశీలించిన ముంబై సెష‌న్స్ కోర్టు సూరజ్ పంచోలీపై విచార‌ణ జ‌ర‌పాల‌ని నిర్ణ‌యించింది. నేరం నిరూప‌ణ అయితే అత‌నికి గ‌రిష్టంగా ప‌దేళ్ల జైలు శిక్ష ప‌డే అవ‌కాశ‌ముంది. కోర్టు నిర్ణ‌యంపై రుబియా హ‌ర్షం వ్య‌క్తంచేసింది. నాలుగేళ్ల పోరాటం ఫ‌లించింద‌ని, ఈ దేశంలో న్యాయం ఇంకా బ‌తికే ఉంద‌న్న భావ‌న క‌లిగింద‌ని ఆమె వ్యాఖ్యానించింది. ఆత్మ‌హ‌త్య‌కు ప్రేరేపించాడు అన‌డం కంటే..ఆ దుర్మార్గుణ్ని హంత‌కుడిగా గుర్తించి ఉంటే ఇంకా సంతోషించేదాన్న‌ని, అదే డిమాండ్ తో హైకోర్టుకు వెళ్తాన‌నిరుబియా తెలిపింది.