ఇంకా విడుదల కాని నాసా ఫోటోలు

ఇంకా విడుదల కాని నాసా ఫోటోలు

ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-2 తాలూకు విక్రమ్ ల్యాండర్ గురించి ఇంకా ఉత్కంఠ వీడట్లేదు. చంద్రుడిపై హార్డ్ ల్యాండ్ అయిన విక్రమ్ ఫొటోలు తీసేందుకు ప్రయత్నించనున్నట్టు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ఇదివరకే ప్రకటించింది. విక్రమ్ దిగినట్టుగా భావిస్తున్న ప్రాంతంపైకి తాము ప్రయోగించిన లూనార్ రికానసెన్స్ ఆర్బిటార్ ఈ నెల 17న రానున్నట్టు గతంలో తెలిపింది. ఈ సమయంలో విక్రమ్ ఫొటోలు తీయడానికి ఎల్‌ఆర్‌ఓ ప్రయత్నిస్తుందని నాసా పేర్కొంది. ఈ ఫొటోలు తమకు అందగానే.. వాటిని ఇస్రో శాస్త్రవేత్తలకు అందజేస్తామని కూడా నాసా వెల్లడించింది. అయితే, మంగళవారం అర్థరాత్రి దాటేవరకూ విక్రమ్ ల్యాండర్‌కు సంబంధించిన ఎలాంటి ఫొటోలను నాసా విడుదల చేయలేదు. మరోవైపు చంద్రయాన్-2 మిషన్‌లో తమ వెన్నంటి ఉన్న భారతీయులకు ఇస్రో మంగళవారం ధన్యవాదాలు తెలిపింది. భారతీయుల ఆకాంక్షలతో, కలలతో స్ఫూర్తి పొందుతూ మేము మున్ముందుకు సాగుతాం. అత్యున్నత లక్ష్యాలను సాధించేలా మమ్మల్ని ప్రోత్సహిస్తున్న మీకు కృతజ్ఞతలు అని ఇస్రో ట్వీట్ చేసింది.