టీడీపీ దెబ్బ స్టాక్ మార్కెట్ల‌కూ త‌గిలింది…

Stock Market down after TDP Quits alliance with NDA

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
టీడీపీ దెబ్బ‌కు స్టాక్ మార్కెట్లు కుప్ప‌కూలాయి. కేంద్ర‌ప్ర‌భుత్వంపై టీడీపీ చేసిన తిరుగుబాటు ఇన్వెస్ట‌ర్ల సెంటిమెంట్ ను దెబ్బ‌తీసింది. ఎన్డీఏలో అతిపెద్ద భాగ‌స్వామి అయిన టీడీపీ… కేంద్ర‌ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా గ‌ళ‌మెత్తిన త‌ర్వాత ఈ ఉద‌యం చ‌క‌చ‌కా మారిపోయిన రాజ‌కీయ ప‌రిణామాలు మార్కెట్ల‌పై తీవ్ర ప్రభావం చూపాయి. టీడీపీ ఎన్డీఏ కు గుడ్ బై చెప్ప‌డాన్ని వివిధ పార్టీలు స‌మ‌ర్థించ‌డంతో ఏర్ప‌డిన రాజ‌కీయ అనిశ్చితి మార్కెట్ల‌ను కుదేలుప‌రిచింది. అంత‌ర్జాతీయ మార్కెట్ల బ‌ల‌హీన సంకేతాల‌తో ఆరంభం నుంచే కుదేల‌వుతూ వ‌స్తున్న సూచీలు… దేశంలో ఒక్క‌సారిగా వేడెక్కిన రాజ‌కీయ వాతావ‌ర‌ణం ప్ర‌భావంతో భారీ ప‌త‌నాన్ని చ‌విచూశాయి. చివ‌రిగంట‌ల్లో అయితే కుప్ప‌కూలి భారీ న‌ష్టాలు మూట‌గ‌ట్టుకున్నాయి.

అంత‌ర్జాతీయ సంకేతాలు, వివిధ రంగాల‌కు చెందిన షేర్ల అమ్మ‌కాల ఒత్తిడి నేప‌థ్యంలో ఈ ఉద‌యం స్టాక్ మార్కెట్లు న‌ష్టాల‌తో ట్రేడింగ్ ఆరంభించాయి. 33,548 వ‌ద్ద 137 పాయింట్ల న‌ష్టంతో ప్రారంభ‌మైన సెన్సెక్స్ ఆ త‌ర్వాత ఏ ద‌శ‌లోనూ కోలుకోలేక‌పోయింది. అదే స‌మ‌యంలో టీడీపీ అవిశ్వాస తీర్మానంపై దేశంలో రాజ‌కీయ వేడి ర‌గ‌ల‌డంతో మార్కెట్లు మ‌రింత ప‌త‌న‌మ‌య్యాయి. ఒక ద‌శ‌లో 550 పాయింట్ల‌కు పైగా ప‌డిపోయిన సెన్సెక్స్ 33,120 పాయింట్ల క‌నిష్ట‌స్థాయి న‌మోదుచేసింది. చివ‌ర్లో కాస్త కోలుకున్న‌ప్ప‌టికీ… భారీ న‌ష్టాలు మాత్రం త‌ప్ప‌లేదు. పెట్టుబ‌డిదారులు పెద్ద ఎత్తున అమ్మ‌కాల‌కు మొగ్గుచూప‌డంతో సెన్సెక్స్ చివ‌ర‌కు 510 పాయింట్లు ప‌త‌న‌మై 33,176 వ‌ద్ద ముగిసింది. నిఫ్టీ 165 పాయింట్లు కోల్పోయి 10,195వ‌ద్ద స్థిర‌పడింది. దాదాపు అన్ని రంగాల షేర్లు న‌ష్టాల్లోనే ముగిశాయి. ఒక్కో కంపెనీ షేర్ విలువ 3నుంచి 4శాతానికి పైగా ప‌త‌న‌మైంది.