ఏపీకి తుఫాను ముప్పు…!

Storm Threat To AP

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి సోమవారం తూర్పుమధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించినట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. ఇది మరింత బలపడి బుధవారం నాటికి తుఫానుగా మారుతుందని తెలిపింది. తుపాను కదలికలను అనుసరించి ప్రధానంగా ఉత్తరాంధ్ర జిల్లాలపై ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం నిపుణులు చెబుతున్నారు. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమేపీ బలపడుతూ ఉత్తరాంధ్ర, ఒడిశాల వైపు ప్రయాణిస్తుండడమే ఇందుకు కారణం.

heavy-rains
సోమవారం రాత్రికి కళింగపట్నం, గోపాల్‌పూర్‌ల మధ్య దాదాపు 600 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉంది. ఇది గంటకు 12 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణిస్తుండడంతో రాగల 48 గంటల్లో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు. తుపాను ప్రభావం వల్ల మంగళవారం కోస్తా జిల్లాల్లో గంటకు 55 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, తుపానుగా మారాక గాలుల తీవ్రత 90 కిలోమీటర్ల వేగం వరకు పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఈ తుపానుకు ‘టిట్లీ’ అని పేరు పెట్టారు.

ap-rains
దీని ప్రభావంతో అక్టోబరు 10, 11 తేదీల్లో ఒడిశా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ముఖ్యంగా ఒడిశాలోని దక్షిణ కోస్తా జిల్లాలో పలుచోట్ల రెండు రోజులపాటు కుంభవృష్టి కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. ఇక ఉత్తరాంధ్రలోనూ రెండు రోజులపాటు అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు, కొద్ది చోట్ల అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 24 గంటల్లో వాయుగుండం బలపడి తీవ్రవాయుగుండంగా మారే అవకాశం ఉందని, 48 గంటల్లో అదికాస్తా బలపడి తుపానుగా మారే అవకాశం ఉందని విపత్తుల శాఖ తెలిపింది. ఈ రెండు రోజులు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

RAINSAP