ఇప్పట్లో ఆలోచన లేదట!

Sukumar clarity about his next movie with Ram Charan

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

విభిన్న తరహా చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక బ్రాండ్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న దర్శకుడు సుకుమార్‌. ‘నేనొక్కడినే’, ‘నాన్నకు ప్రేమతో’ చిత్రాలతో తెలుగు సినిమా స్థాయిని పెంచి, ప్రేక్షకుల అభిరుచిని మార్చిన దర్శకుడు సుకుమార్‌ ప్రస్తుతం రామ్‌ చరణ్‌ హీరోగా రంగస్థలం చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి అయ్యి విడుదలకు సిద్దం అవుతుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుక ఈనెల 18న జరుపబోతున్నట్లుగా ప్రకటించేందుకు సుకుమార్‌ మీడియా ముందుకు వచ్చాడు. ఈ సందర్బంగా గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో వస్తున్న పుకార్లకు ఫుల్‌స్టాప్‌ పెట్టే ప్రయత్నం చేశాడు.

‘రంగస్థలం’ చిత్రం తర్వాత రామ్‌ చరణ్‌తో మరో సినిమాను సుకుమార్‌ ప్లాన్‌ చేశాడు అని, త్వరలోనే ఆ సినిమాను కూడా పట్టాలెక్కించే అవకాశం ఉందని, రాజమౌళి సినిమా ఆన్‌ సెట్స్‌ ఉండగానే సుకుమార్‌ సినిమాను మొదలు పెడతాడు అంటూ కొందరు ఔత్సాహికులు పోస్ట్‌లు చేస్తున్నారు. ఆ విషయమై మీడియా సుకుమార్‌ను ప్రశ్నించగా చరణ్‌తో సినిమా విషయమై ఎలాంటి ఆలోచన లేదని, రంగస్థలం తర్వాత తాను చరణ్‌తో సినిమా చేయడం లేదని, ఆ ఆలోచన కూడా లేదని సుకుమార్‌ చెప్పుకొచ్చాడు. తన తదుపరి సినిమా వివరాలను రంగస్థలం విడుదలైన తర్వాత ప్రకటిస్తాను అంటూ సుకుమార్‌ చెప్పుకొచ్చాడు. సుకుమార్‌ దర్శకత్వంలో సినిమా చేసేందుకు స్టార్‌ హీరోలు సైతం క్యూలు కడుతున్నారు. ఈ నేపథ్యంలో సుక్కు తర్వాత సినిమాను ఎవరితో చేస్తాడో చూడాలి.