నా చివరి శ్వాస వరకూ మీరు ఉంటారు

నా చివరి శ్వాస వరకూ మీరు ఉంటారు

‘‘నా కళ్లను నేను మూసి ఉంచుతున్నాను. మళ్లీ మిమ్మల్ని చూడాలనే ఆరాటంతో.. నా చెవులను మూసి ఉంచుతున్నాను. మీ మాటలను వినగలనని’’ అని ఎంతో భావోద్వేగంతో ప్రముఖ నటి సుమలత తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ని షేర్‌ చేశారు. తెలుగింటి ఆడపడుచు సుమలత ప్రముఖ కన్నడ నటుడు అంబరీష్‌ని వివాహం చేసుకుని కన్నడ ఇంటి కోడలైన విషయం తెలిసిందే. 1991లో వీరి పెళ్లయింది. ఒక కుమారుడు ఉన్నాడు. అంబరీష్‌–సుమలత హ్యాపీ కపుల్‌. భర్త మరణం తర్వాత సుమలత పైకి ధైర్యంగా కనబడుతున్నప్పటికీ లోలోపల ఆయన్ను ఎంతగా మిస్సవుతున్నారో ఆమె మాటలు చెబుతున్నాయి. అంబరీష్‌ చనిపోయి ఈ నవంబర్‌ 24తో రెండేళ్లవుతోంది. ఈ సందర్భంగా సుమలత తన మనసులోని భావాలను ఈ విధంగా పంచుకున్నారు.

‘‘కళ్లు మూసి ఉంచగలను.. చెవులను కూడా మూయగలను కానీ నా హృదయాన్ని మాత్రం మూయలేను. ఎందుకంటే ఒక అనంతమైన ప్రేమ, ఒక అపూర్వమైన శక్తి, ఎన్నో జ్ఞాపకాలు దాగి ఉన్న హృదయం అది. మీరు లేకుండా రెండేళ్లు గడిచాయి. మీతో గడిపిన ప్రతి క్షణం ఎంత విలువైనదో తలుచుకుంటున్నాను. మనం పంచుకున్న ఆ తీయని క్షణాలు, జ్ఞాపకాలు, నవ్వులు, ప్రేమ.. అన్నీ అపూర్వమైనవి. సవాళ్లు ఎదురైనప్పుడు నా చెయ్యి పట్టుకుని నడిపించిన క్షణాలు, కలిగించిన ఆత్మవిశ్వాసం, నింపిన ధైర్యం, చీకటి క్షణాల్లో నింపిన నమ్మకం, ప్రేమ, వదిలి వెళ్లిన వారసత్వం (కుమారుడిని ఉద్దేశించి).. ఇవన్నీ నా జీవితం మొత్తం నన్ను నడిపిస్తాయి. మీ మంచితనం తాలూకు వెలుగు జీవితంలో నాకెదురయ్యే కష్టాల నుంచి నన్ను కాపాడుతుంది.