నాలుగు రాష్ట్రాల్లో విడుద‌ల కాని ప‌ద్మావ‌త్… సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కార‌ణ పిటిష‌న్

The-Supreme-Court-Has-Filed

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ప‌ద్మావ‌త్ సినిమా ప్రద‌ర్శ‌న‌కు అడ్డంకులు క‌ల‌గ‌కుండా భద్ర‌తా చ‌ర్య‌లు తీసుకోవాల్సిన బాధ్య‌త ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలదే అని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన‌ప్ప‌టికీ నాలుగు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సినిమా ప్ర‌ద‌ర్శ‌న‌కు నోచుకోలేదు. దీనిపై సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కార‌ణ పిటిష‌న్ ఫైల్ అయింది. కోర్టు ఆదేశాల మేర‌కు భ‌ద్ర‌తా చ‌ర్య‌లు చే ప‌ట్ట‌డంలో నాలుగు రాష్ట్రాలు విఫ‌ల‌మ‌య్యాయ‌ని పిటిష‌న్ లో ఆరోపించారు. ఆందోళ‌న‌ల‌కు నేతృత్వం వ‌హిస్తున్న రాజ్ పుత్ క‌ర్ణిసేన‌కు చెందిన ముగ్గురు వ్య‌క్తుల‌పై కూడా కోర్టు ధిక్కార పిటిష‌న్ న‌మోద‌యింది.

రాజ్ పుత్ ల ఆందోళ‌న నేప‌థ్యంలో థియేట‌ర్లు త‌గుల‌బెడ‌తార‌నే భ‌యంతో రాజ‌స్థాన్, గుజ‌రాత్, మ‌ధ్య‌ప్ర‌దేశ్, గోవా రాష్ట్రాల్లో చిత్రం విడుద‌ల కాలేదు. ప‌ద్మావ‌త్ నిర్మాత‌ల‌కు ఇది కోలుకోలేని దెబ్బ‌ని భావిస్తున్నారు. సినిమా అనుకున్న రేంజ్ లో లేద‌ని ఓ ప‌క్క రేటింగ్ లు వ‌స్తుండ‌గా..మ‌రోవైపు నాలుగు రాష్ట్రాల్లో విడుద‌ల కాక‌పోవ‌డం నిర్మాత‌ల‌కు భారీ న‌ష్టాన్ని మిగిల్చ‌నుంది. నిర్మాణ ద‌శ‌నుంచే ప‌ద్మావ‌త్ ను వ్య‌తిరేకిస్తున్న రాజ్ పుత్ క‌ర్ణిసేన‌…సుప్రీంకోర్టు ఉత్త‌ర్వులు, పోలీస్ హెచ్చ‌రిక‌లు బేఖాత‌రు చేస్తూ సినిమా విడుద‌ల‌కు ఒక్క‌రోజు ముందు నాలుగు రాష్ట్రాల్లో విధ్వంస‌కాండ‌కు దిగింది. క‌ర్ణిసేన కార్య‌క‌ర్త‌లు ర‌హ‌దారుల దిగ్బంధం, ప్ర‌భుత్వ ర‌వాణా సంస్థ‌ల వాహ‌నాల‌పై దాడులు వంటి హింసాత్మ‌క చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ్డారు. గురుగ్రామ్ లో వందల‌మంది క‌ర్ణిసేన కార్య‌క‌ర్త‌లు, రాజ్ పుత్ ల మ‌ద్ద‌తుదారులు నిషేధాజ్ఞ‌లు ధిక్క‌రించి నిర‌స‌న‌లు చేప‌ట్టారు. హ‌ర్యానా రాష్ట్ర ర‌వాణా సంస్థ‌కు చెందిన బ‌స్సుకు నిప్పంటించారు. ఢిల్లీ-జైపూర్ జాతీయ ర‌హ‌దారిని దిగ్బంధించారు.

ఖిడ్కి దౌలా ప‌న్ను వ‌సూలు కేంద్రాన్ని, ప‌లు వాహ‌నాలను ధ్వంసం చేశారు. జైపూర్ లో క‌ర్ణిసేన స‌భ్యులు రాష్ట్ర ర‌వాణా సంస్థ‌కు చెందిన రెండు బ‌స్సుల‌పై దాడికి పాల్ప‌డ్డారు. ల‌క్నో, ముంబై, పూణె, నాసిక్, భోపాల్, ఇండోర్, గుణ త‌దిత‌ర చోట్ల నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు జ‌రిగాయి. ఢిల్లీలో ఆందోళ‌న‌కారులు స్కూలు బ‌స్సుల‌పై రాళ్ల‌దాడికి తెగ‌బ‌డ్డారు. చిన్నారుల‌తో వెళ్తున్న స్కూల్ బ‌స్సుపై ఆందోళ‌నకారులు రాళ్లు విస‌ర‌డంతో వాటి నుంచి త‌ప్పించుకోడానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు సీట్ల మ‌ధ్య దాక్కోవ‌లిసి వ‌చ్చింది. ఈ ఘ‌ట‌ట‌న‌తో చిన్నారులు భ‌యంతో వ‌ణికిపోయారు. రాజ్ పుత్ క‌ర్ణిసేన విధ్వంస కాండ‌తో నాలుగు రాష్ట్రాల్లో థియేట‌ర్ యాజ‌మాన్యాలు, డిస్ట్రిబ్యూట‌ర్లు బెంబేలెత్తిపోయారు. సినిమా విడుద‌ల‌కు అనుమతి ఉన్న‌ప్ప‌టికీ ఈ విధ్వంస కాండ చూసిన వారు సినిమాను త‌మ థియేట‌ర్ల‌లో ఆడించ‌కూడ‌దని నిర్ణ‌యించుకున్నారు.