సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పరీక్షల నిర్వహణపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విద్యార్థులను గందరగోళానికి గురిచేయవద్దంటూ వ్యాఖ్యానించింది.అయితే.. ఈ ఏడాది సీబీఎస్​ఈ, సీఐఎస్‌సీఈ, ఎన్‌ఐఓఎస్‌ సహా ఇతర బోర్డులు ఆఫ్​లైన్​లో నిర్వహించే 10, 12వ తరగతుల బోర్డు పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.

ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ చేపట్టిన జస్టిస్​ ఎంఏ ఖాన్విల్కర్​ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్టు ధర్మాసనం పేర్కొంది. ఈ క్రమంలోనే ఇది పరీక్షలకు సిద్ధమవుతోన్న విద్యార్థుల్లో తప్పుడు ఆశలను కలిగించటమే కాకుండా గందరగోళాన్ని సృష్టిస్తుందని స్పష్టం చేసింది. విద్యార్థులను, అధికారులను వారి విధులను వారు నిర్వర్తించనివ్వాలని ధర్మాసనం పేర్కొంది.

ఇలాంటి పిటిషన్లు విద్యార్థుల్లో తప్పుడు భావనను, గందరగోళాన్ని కలిగిస్తాయని ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది.ఇదిలా ఉండగా.. ఏప్రిల్​ 26 నుంచి 10, 12వ తరగతుల టెర్మ్​-2 బోర్డు పరీక్షలు నిర్వహించాలని సీబీఎస్​ఈ నిర్ణయించింది. సీఐఎస్‌సీఈ కూడా బోర్డు పరీక్షలను ఏప్రిల్‌ చివరి వారంలో నిర్వహించనుండగా కొన్ని రాష్ట్రాల్లో బోర్డు పరీక్షలు మార్చి 4వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.