దీదీకి షాకిచ్చిన సుప్రీం కోర్టు !

Supreme Court Gives Shock To Didi

పశ్చిమబెంగాల్‌ కి సంబందించిన మమతా బెనర్జీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. శారదా చిట్‌ఫండ్స్ కుంభకోణం కేసులో ఆధారాలు మాయం చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ను సీబీఐ ముందు విచారణకు హాజరు కావాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసు విచారణలో సీబీఐకి రాజీవ్ కుమార్ పూర్తిగా సహకరించాలని ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ఆదేశించారు. అయితే రాజీవ్‌ కుమార్‌ ని అరెస్ట్‌ చేయొద్దని ఆయన స్పష్టం చేశారు. సీబీఐ దాఖలు చేసిన కోర్టు ధిక్కారం పిటిషన్‌పై ఫిబ్రవరి 18లోగా సమాధానం చెప్పాలంటూ రాజీవ్‌ కుమార్‌తో పాటు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, డీజీపీలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. సీబీఐ తరఫున అటార్ని జనరల్‌ కేకే వేణుగోపాల్‌ వాదనలు వినిపించారు. అత్యంత కీలక సాక్ష్యాలను రాజీవ్‌ కుమార్‌ నిందితులకు అందజేశారని ఆరోపించారు. కీలక సాక్ష్యాలను సిట్ సాయంతో స్థానిక అధికారులు ధ్వంసం చేశారని సీబీఐ తీవ్ర ఆరోపణలు చేసింది. సీబీఐ కోర్టుకి ఇచ్చిన నివేదికలో వివరాలు ఇలా ఉన్నాయి. శారదా స్కామ్‌కు సంబంధించిన కాల్‌ డేటా రికార్డులను రాజీవ్‌ కుమార్‌ తారుమారు చేశారని కానీ సర్వీస్‌ ప్రొవైడర్స్‌ నుంచి సీబీఐ కాల్‌ డేటా రికార్డులను సేకరించిందని రాజీవ్‌ కుమార్‌ సమర్పించిన కాల్‌ డేటా రికార్డులు భిన్నంగా ఉన్నాయని సీబీఐ పేర్కొంది. శారదా చిట్‌ ఫండ్‌ స్కామ్‌ను రాజీవ్‌ కుమార్‌ దర్యాప్తు చేసారని సిట్‌ సేకరించిన ల్యాప్ ట్యాప్‌, మొబైల్‌ ఫోన్స్‌ వంటివి ఈ కేసులోని నిందితులకు రాజీవ్‌కుమార్‌ అందజేశారని సీబీఐ ఆరోపించింది. కోల్‌కతా హైకోర్టు ఈ కేసు దర్యాప్తును సమీక్షిస్తున్నా భారీ కుట్రకు రాజీవ్‌ కుమార్‌ పాల్పడ్డారని.. సీబీఐ చేతికి అందకముందే స్థానిక అధికారులు కీలక సాక్ష్యాలను ధ్వంసం చేశారని సీబీఐ ఆరోపించింది.

అయితే పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం తరపున సీనియర్‌ లాయర్‌ అభిషేక్‌ మను సింఘ్వి వాదిస్తూ.. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌ లేదని, మరి సాక్ష్యాలను రాజీవ్‌కుమార్‌ ధ్వంసం ఎలా చేస్తారని వాదించారు. రాత్రి సీబీఐ అధికారులను రాష్ట్ర పోలీసులు అరెస్ట్‌ చేయలేదంటూ వీడియోను కోర్టుకు సమర్పించారు. కేవలం రాజకీయ కక్షతో ఎన్నికల ముందు సీబీఐ బెదిరిస్తోందని అన్నారు. ఇరుపక్షాల వాదన విన్న కోర్టు రాజీవ్‌ కుమార్‌ సీబీఐ విచారణకు హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో మమతా సర్కార్ కి షాక్ తగినట్లు అయింది. దీనిపై మమతా స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పుని తాము గౌరవిస్తామన్నారు. రాజీవ్‌ కుమార్‌ సీబీఐ విచారణకు సహకరిస్తారని తెలిపారు.