న్యాయమూర్తుల వ్యాఖ్య‌ల‌తో నివ్వెర‌పోయిన దేశం

Supreme Court Judges Revolt Against On Dipak Misra

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

భార‌త న్యాయ‌వ్య‌వ‌స్థ‌లో అనూహ్య కుదుపు దేశ‌ప్ర‌జ‌ల్ని నివ్వెర‌ప‌రిచింది. దేశ చ‌రిత్ర‌లో తొలిసారి న్యాయ‌మూర్తులు మీడియా ముందుకు రావ‌డం న్యాయ‌, రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌ల్లో తీవ్ర ప్ర‌కంప‌నలు సృష్టించింది. ఇలాంటి ప‌రిస్థితి అవాంఛ‌నీయ‌మ‌ని, బాధాక‌ర‌మ‌ని న్యాయ‌నిపుణులు ఆవేద‌న చెందారు. ఇది సుప్రీంకోర్టు అంత‌ర్గ‌త వ్య‌వ‌హార‌మ‌ని, త‌మ జోక్య‌మేమీ ఉండ‌బోద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తేల్చిచెప్పింది. సుప్రీంకోర్టు సీనియ‌ర్ న్యాయ‌మూర్తులు జ‌స్టిస్ జాస్తి చ‌ల‌మేశ్వ‌ర్, జ‌స్టిస్ రంజ‌న్ గొగోయ్, జ‌స్టిస్ మ‌ద‌న్. బి. లోకూర్, జ‌స్టిస్ కురియ‌న్ జోసెఫ్ లు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి దీప‌క్ మిశ్రాపై మీడియా ముందుకొచ్చి ఆరోప‌ణలు చేశారు. భార‌త న్యాయ‌వ్య‌వ‌స్థ‌లో ఇది అసాధార‌ణ ఘ‌ట‌న అని, ఇది త‌మ‌కు సంతోష‌క‌రం కాక‌పోయినా విధిలేని పరిస్థితుల్లో ఇలా చేస్తున్నామ‌ని న్యాయ‌మూర్తులు చెప్పిన‌ప్ప‌టికీ ఈ ప‌రిణామాన్ని దేశం జీర్ణించుకోలేక‌పోతోంది.

గ‌త అక్టోబ‌ర్ 27న లూథ్రా వ‌ర్సెస్ భార‌త ప్ర‌భుత్వం కేసులో వ‌చ్చిన ఉత్త‌ర్వులు, సుప్రీంకోర్టులో అనుకూల తీర్పు వ‌చ్చేలా చేస్తామ‌ని చెప్పి లంచాలు తీసుకున్నార‌ని ఆరోపిస్తూ దాఖ‌లైన కేసు, ఒడిసా హైకోర్టు మాజీ జ‌డ్జి ఇష్ర‌త్ మ‌స్రూర్ ఖుద్దూసీ నిందితుడుగా ఉన్న కేసుతో పాటు, సోహ్రాబుద్ధీన్ ఫేక్ ఎన్ కౌంట‌ర్ కేసును విచారించిన సీబీఐ కోర్టు ప్ర‌త్యేక న్యాయ‌మూర్తి బీహెచ్ లోయా అనుమానాస్ప‌ద మృతి కేసులు న్యాయమూర్తుల‌కు, ప్ర‌ధాన న్యాయ‌మూర్తికి మ‌ధ్య దూరం పెంచిన‌ట్టు భావిస్తున్నారు. లోయా కేసులో అభిప్రాయ‌భేదాల‌తోనే మీరు ఇలా మీడియా స‌మావేశం ఏర్పాటుచేశారా అని విలేక‌రులు ప‌దే ప‌దే అడిగిన ప్ర‌శ్న‌ల‌కు న్యాయ‌మూర్తులు స్ప‌ష్ట‌మైన స‌మాధానం ఇవ్వ‌లేదు. అంద‌రికీ అన్ని విష‌యాలు తెలుస‌ని, తాము రాజ‌కీయాలు చేయ‌డానికి రాలేదని, తాము విడుద‌ల చేసిన లేఖ చూస్తే అన్ని విష‌యాలూ బోధ‌ప‌డ‌తాయ‌ని మాత్ర‌మే బ‌దులిచ్చారు. ఇది నిర‌స‌న కాద‌ని, దేశం ప‌ట్ల త‌మ బాధ్య‌త‌ని న్యాయ‌మూర్తులు వ్యాఖ్యానించారు.

Dipak-Misra

న్యాయ‌మూర్తుల మీడియా స‌మావేశం త‌ర్వాత దేశ‌వ్యాప్తంగా ప్ర‌ధాన న్యాయ‌మూర్తి దీప‌క్ మిశ్రా వ్య‌క్తిత్వంపై చ‌ర్చ జ‌రుగుతోంది. న్యాయ‌మూర్తుల ఆరోప‌ణ‌ల‌ను ప‌క్క‌నబెడితే కొంద‌రు న్యాయ‌కోవిదులు ఆయ‌న వ్య‌క్తిత్వాన్ని ప్ర‌శంసిస్తున్నారు. దీప‌క్ మిశ్రా వ్య‌క్తిత్వం విల‌క్ష‌ణ‌మైన‌ద‌ని, సంచ‌ల‌న తీర్పులు ఇవ్వ‌డంలో ఆయ‌న ముందుంటార‌ని వారు కొనియాడుతున్నారు. ముంబై వ‌రుస పేలుళ్ల నిందితుడు యాకూబ్ మెమ‌న్ క్ష‌మాభిక్ష పిటిష‌న్ ను తిర‌స్క‌రించ‌డం, నిర్భ‌య కేసులో దోషులకు మ‌ర‌ణ‌శిక్ష‌ను ధృవీక‌రించ‌డం, సినిమా హాళ్ల‌లో జాతీయ‌గీతాన్ని త‌ప్ప‌నిస‌రి చేయ‌డం, బాల‌ల‌తో తీసే అశ్లీల చిత్రాలు చూపించే వెబ్ సైట్ల‌ను నిషేధించ‌డం, ప్ర‌భుత్వ అధికారుల ప‌దోన్న‌తుల్లో రిజ‌ర్వేష‌న్లు ర‌ద్దుచేయ‌డం, బీసీసీఐ సంస్క‌ర‌ణ‌లు, ఆధార్ గోప్య‌త‌, అయోధ్య రామాల‌యం వంటి ఎన్నో కీల‌క కేసులను దీప‌క్ మిశ్రా విచారించారు.