మాకు డ్రగ్స్‌ అవసరం లేదు

మాకు డ్రగ్స్‌ అవసరం లేదు

ఈ ఏడాది సంగీత దర్శకుడు థమన్‌ మాంచి స్పీడు మీదున్నాడు. తను అందించే సంగీతం ఒకెత్తు అయితే బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ మరో లెవల్‌లో ఉంటోంది. మాస్‌ మహారాజ రవితేజ నటించిన క్రాక్‌ సినిమాకు థమన్‌ అందించిన బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ మరింత బలాన్నిచ్చింది. దీంతో ఈ సినిమానే కాదు, మ్యూజిక్‌ కూడా జనాలకు బాగా కిక్కిచ్చింది. ఇది చూసి టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున కూడా తన వైల్డ్‌డాగ్‌ సినిమాకు థమన్‌ కావాలని కోరాడట. అలా నాగ్‌ సినిమాలో కూడా అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్‌ ఇచ్చి అందరినీ ఫిదా చేశాడు.

ఇక మూడేళ్ల తర్వాత ‘వకీల్‌సాబ్‌’తో రీ ఎంట్రీ ఇచ్చిన పవన్‌ కల్యాణ్‌ సినిమాకు కూడా మంచి నేపథ్య సంగీతాన్ని అందించి అందరి చేత ప్రశంసలు అందించుకున్నాడు. ఏప్రిల్‌ 30న ఈ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైన విషయం తెలిసిందే. తాజాగా ఓటీటీలో ఈ సినిమాను వీక్షించిన ఓ నెటిజన్‌ థమన్‌ను మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు.

‘ఇది కంపోజ్‌ చేసేటప్పుడు ఏమైనా తాగావా ఏంటి? నీ కెరీర్‌లో ఇప్పటివరకు చేసినవాటిలో ఇదే హైలైట్‌. అసలు మామూలుగా లేదు..’ అని ట్వీట్‌ చేశాడు. ఇది చూసిన థమన్‌.. ‘అలాంటిదేమీ లేదు, కాకపోతే పవన్‌ కల్యాణ్‌ గారిని స్క్రీన్‌ మీద చూడటంతో అలా అనిపిస్తుంది అంతే. మాకు డ్రగ్స్‌ అవసరం లేదు, కేవలం హగ్స్‌, థగ్స్‌ ఇస్తే చాలు.. రెచ్చిపోతాం..’ అని రిప్లై ఇచ్చాడు.