సారొచ్చారు !

Tamilnadu Govt appoints Teacher Bhagavan in same school

తమిళనాడులోని తిరువల్లూరు జిల్లా వెల్లియగరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేసే ఆంగ్ల ఉపాధ్యాయుడు భగవాన్ బదిలీపై వెళ్లిపోతుంటే విద్యార్థులంతా ఆయన చుట్టూ చేరి వెళ్లొద్దని బోరున ఏడ్చిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. దీన్ని కొందరు పేరెంట్స్ వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో వైరల్‌గా మారడంతో ఆయన బదిలీని అప్పటికి నిలిపివేస్తూ ఆ జిల్లా విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఇటీవల తమిళనాడు ప్రభుత్వం టీచర్ల బదిలీలు చేపట్టింది. భగవాన్‌ను కూడా తిరుత్తణికి బదిలీ చేసింది. ఎంతో ఇష్టమైన తమ గురువు దూరమవుతున్నారని తెలిసిన విద్యార్థులు తట్టుకోలేకపోయారు.

ఇందు కోసం ఓ రోజు పాఠశాలకు సామూహికంగా సెలవు పెట్టారు. బుధవారం ఆయన చివరి సారిగా బడికి వచ్చి వెళ్తుంటే… గేటు దాకా పరిగెత్తుకుంటూ వెళ్లి… మీరిక్కడే ఉండిపోండి మాస్టారూ అంటూ అడ్డుకున్నారు. గట్టిగా హత్తుకుని వెక్కి వెక్కి ఏడ్చారు. తల్లిదండ్రులు కూడా పిల్లలకు మద్దతుగా నిలవడంతో ప్రభుత్వం ఆయనకు మళ్లీ అక్కడే పోస్టింగ్ ఇచ్చింది. దీంతో తిరుత్తణి పాఠశాలకు బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయుడు భగవాన్ పూర్వస్థానానికి చేరుకున్నారు. తమకు ఎంతో ఇష్టమైన ఉపాధ్యాయుడు తిరిగిరావడంతో విద్యార్థుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.