మాజీ తెలుగుదేశం ఎంపీ కన్నుమూత

tdp leader kota saidaiah passesaway

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

గుంటూరు జిల్లా నరసరావుపేట మాజీ ఎంపీ, టీడీపీ నేత కోట సైదయ్య (86) అదివారం మృతి చెందారు. గత ఏడాదిన్నర నుండి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఏడాది క్రితం కోమాలోకి వెళ్ళిపోయారు . ఈ క్రమంలో అదివారం తెల్లవారు జామున తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య ఉన్నారు. భౌతికకాయాన్ని స్వగ్రామమైన దుర్గి మండలం ఓబులేసుని పల్లెకు తీసుకెళ్లారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సైదయ్య ఆ పార్టీలో చీలిక అనంతరం కొంతకాలం కాంగ్రెస్‌ (ఎస్‌)లో కొనసాగారు. అనంతరం టిడిపిలో చేరి మాచర్ల మార్కెట్‌ యార్డు చైర్మన్‌గా పని చేశారు. ఆ తరువాత 1996 ఎన్నికల్లో ఆయన టీడీపీ ఎంపిగా పోటీచేసి, కాంగ్రెస్‌ అభ్యర్థి కాసు కృష్ణారెడ్డిపై సుమారు 19 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆ కాలంలోనే కేంద్రంలో యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం ఏర్పడి దేవగౌడ ప్రధానిగా చేశారు. అయితే 18 నెలల తర్వాత యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం రద్దయి ఎన్నికలొచ్చాయి. 1998లో కేంద్రంలో మధ్యంతర ఎన్నికలు రావడంతో పద్దెనిమిది నెలలకే ఆయన ఎంపీ పదవి పరిమితమైంది. అప్పుడు కొణిజేటి రోశయ్యపై పోటీ చేసిన సైదయ్య ఓడిపోయారు.

మృదు స్వభావి ఉండే కోట సైదయ్య సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడుగా పేరుంది. సైదయ్య అంత్యక్రియలు ఈరోజు అధికార లాంఛనాలతో నిర్వహిస్తారని తెలుస్తోంది. సైదయ్య అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించాలని అధికారులని చంద్రబాబు ఆదేశించారని తెలుస్తోంది. పల్నాడులోని మారుమూల పల్లె నుంచి ఢిల్లీ రాజకీయాల వరకు ఎదిగిన ఆయనలో పార్లమెంట్‌ సభ్యునన్నే హంగూ ఆర్భాటం ఆయనలో ఎక్కడా కనిపించవు. మాచర్లలోని ప్రధాన రహదారిపై నడుస్తూ కనిపించిన ప్రతి వ్యక్తిని ఆప్యాయంగా పలకరించే కోట సైదయ్యను రాజకీయనేతగా కన్నా, తమ సొంతమనిషిగా భావించేవారు ఎందరో. గుంటూరు జిల్లా దుర్గి మండలం ఓబులేసునిపల్లెలోని కోట జానయ్య, మహాలక్ష్మమ్మలకు రెండో కుమారునిగా జన్మించిన ఆయన కొద్దికాలం రైల్వే ఉద్యోగిగా పనిచేశారు. ఆ తరువాత ఉద్యోగానికి రాజీనామా చేసి స్వగ్రామంలోనే ఉంటూ గ్రామ అభివృద్ధికి సహచరులతో కలసి పనిచేశారు. ఈ క్రమంలో ఎదుగుతూ తొలుత ఆ గ్రామ సర్పంచ్ స్థాయి నుండి నరసరావుపెట్ ఎంపీ అయ్యే వరకు ఆయన ప్రస్థానం కొనసాగింది.