టీడీపీకి టాస్క్ మాస్టర్లు కావాలి.. షో మాస్టర్లు కాదు! : కేశినేని నాని సెటైర్లు

tdp need task masters not show masters

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో టీడీపీ నేత కేశినేని నాని చురుగ్గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన ట్విట్టర్ లో మరోసారి స్పందించారు. ‘ఇప్పుడు తెలుగుదేశం పార్టీని కాపాడాలంటే టాస్క్ మాస్టర్స్ (పనిచేసే సత్తా ఉన్నవాళ్లు) కావాలి. షో మాస్టర్లు కాదు’ అని కేశినేని నాని ట్వీట్ చేశారు.  గతంలో టీడీపీ నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, బుద్ధా వెంకన్నలను కేశినేని నాని తీవ్రంగా విమర్శించిన సంగతి తెలిసిందే. మంత్రి పదవి వచ్చినందుకు వైసీపీ నేత కొడాలి నాని దేవినేని ఉమకు ధ్యాంక్స్ చెప్పాలి అంటూ కేశినేని చేసిన నర్మగర్భ వ్యాఖ్యలు పార్టీలో ఓ స్థాయిలో దుమారాన్ని రేపాయి. గత ఎన్నికల్లో టీడీపీ నేత నాగూర్ మీరాను విజయవాడలోని ఓ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా నిలబెట్టాలని కేశినేని నాని ప్రతిపాదించగా, దాన్ని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తీవ్రంగా వ్యతిరేకించినట్లు సమాచారం. ఈ వ్యవహారం చిలికిచిలికి గాలివానగా మారడంతో విషయం టీడీపీ అధినేత చంద్రబాబు వరకూ వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బుద్ధా వెంకన్న లాంటి షో మాస్టర్లు కాకుండా తనలాంటి కష్టపడి పనిచేసేవారే పార్టీకి అవసరమని టీడీపీ అధిష్ఠానానికి కేశినేని పరోక్ష సందేశాన్ని పంపినట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.