వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ తొలి పోరుకు టీమిండియా సిద్ధం

Team India ready for the first test of the World Test Championship

విండీస్‌ సిరీస్‌లో భాగంగా నేడు విండీస్‌తో తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో తలపడనుంది భారత్. టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా విండీస్‌ను ఢీకొట్టడానికి సిద్ధమైంది కోహ్లీసేన. ఇప్పటికే టీ-20, వన్డే సిరీస్‌లో ఆధిపత్యాన్ని ప్రదర్శించిన టీమిండియా ఈ సిరీస్‌పైన కన్నేసింది.

మరోవైపు వన్డే టీట్వంటీ సిరీస్‌లో పేలవ ప్రదర్శన చేసిన విండీస్ టెస్ట్ సిరీస్‌ను ఎలాగైనా సొంతం చేసుకోవాలని కసిమీద ఉంది. ఈ మ్యాచ్ నుంచి ప్రపంచ టెస్టు చాంపియన్‌ షిప్‌లో భారత్ ప్రస్థానం ప్రారంభం కానుండటంతో ఎలాంటి కూర్పుతో బరిలో దిగుతుందనేది ఆసక్తిగా మారింది.

రోహిత్, రహానేను తుది జట్టులో కొనసాగిస్తే ఒకే స్పిన్నర్‌తో బరిలో దిగాల్సి ఉంటుంది. టీమిండియాలో కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌ ఓపెనింగ్‌ చేయొచ్చు. రాహుల్‌ ఫామ్‌ను పరిగణనలోకి తీసుకొంటే హనుమ విహారి ఆ స్థానం భర్తీ చేస్తాడు.

ఐతే ఆస్ట్రేలియాలో విహారి కొత్త బంతిని ఎదుర్కోవడంలో ఇబ్బంది పడ్డాడు. మిడిలార్డర్‌లో కుదురుగా ఆడుతున్నాడు. టీమిండియా నయావాల్‌ పుజారాకు మూడో స్థానం ఖాయం. నాలుగులో విరాట్‌ వస్తాడు.

రిషభ్‌ పంత్‌ను ఆరో స్థానంలో పంపించొచ్చు. హార్దిక్‌ పాండ్య లేకపోవడంతో సమతూకం కోసం రవీంద్ర జడేజాను ఏడులో ఆడిస్తారు. ఇక గందరగోళం నెలకొంది ఐదో స్థానంపైనే. వైస్‌ రోహిత్, రహానే, ఇద్దరికీ చోటు దక్కాలంటే కోహ్లీసేన నలుగురు బౌలర్ల వ్యూహంతో బరిలోకి దిగాల్సి ఉంటుంది.