గాంధీ భవన్ లో కొట్టుకున్న నేతలు…!

Telangana Congress Leaders Fight In Gandhi Bhavan

గెలుస్తామనుకున్న ఎన్నికల ఫలితాలు బెడిసికొట్టడంతో రాజుకున్న వేడి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతోంది. హైదరాబాద్‌‌ లోని కాంగ్రెస్ కార్యాలయం గాంధీ భవన్‌ ఈరోజు రణరంగంగా మారింది. కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి బాహాబాహీకి దిగారు. ఒకరిపై మరొకరు కుర్చీలతో దాడులు చేసుకున్నారు. దీంతో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కకు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమం కాస్తా రసాభాసగా మారింది. తెలంగాణ సీఎల్పీ నేతగా బాధ్యతలు స్వీకరించిన భట్టి విక్రమార్కకు ఈరోజు మధ్యాహ్నం గాంధీ భవన్ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తునే తరలివచ్చారు. సన్మాన కార్యక్రమం అనంతరం పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు, ఓబీసీ సెల్ అధ్యక్షుడు నూతి శ్రీకాంత్‌ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి.

శ్రీకాంత్‌కు టికెట్‌ రాకుండా వీహెచ్ అడ్డుకున్నారని ఆరోపిస్త్గూ శ్రీకాంత్ వర్గీయులు వీహెచ్‌ను అడ్డుకున్నారు. వీహెచ్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. బీసీలకు అన్యాయం చేస్తున్నారని వీహెచ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరువర్గాల కార్యకర్తలు కాంగ్రెస్ పెద్దల సమక్షంలోనే పరస్పరం దాడులకు దిగారు. ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు. ఘర్షణ అనంతరం శ్రీకాంత్ తన మద్దతుదారులతో భట్టి విక్రమార్క కార్యాలయం ముందు బైఠాయించారు. తనకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. అనంతరం వీహెచ్‌పై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో నూతి శ్రీకాంత్ అంబర్ పేట నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించారు. కానీ పొత్తులో భాగంగా దానిని తెలంగాణా జనసమితికి అప్పగించాల్సి వచ్చింది.