వాళ్ళ కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకున్నా బుద్ది వస్తుందా ?

telangana-elections-updates

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ఓటింగ్ శాతం తగ్గడంపై మీద ఫైర్ అయ్యారు ప్రముఖ దర్శకుడు కొరటాల శివ. ప్రతి సినిమాలోనూ పౌరుల సామాజిక బాధ్యతను గుర్తు చూస్తూ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న దర్శకుడిగా పేరొందిన కొరటాల శివ రాజధాని నగరంలో ఊహించని విధంగా ఓటింగ్ శాతం తగ్గడంపై ఘాటుగా స్పందించారు. ‘హైదరాబాద్ ప్రజలకు ఏమైంది? సాయంత్రం 3 అయ్యింది పోలింగ్ శాతం కేవలం 35 శాతం మాత్రమే నగర ఓటర్లు సిగ్గుపడాలి’ అంటూ ఓటు హక్కు వినియోగించుకోని ఓటర్లకు చురకలు అంటిస్తూ ఘాటైన వ్యాఖ్య చేశారు. అయితే ఈ వార్త చదివినప్పుడు నాకేమనిపించింది అంటే కొన్ని చోట్ల ఉద్యోగులకి సెలవులే ఇవ్వని కంపెనీలు ఉన్నాయి, వాళ్ళు సెలవులు ఇవ్వకుండా వీళ్ళు వెళ్లి వోటు ఎలా వేస్తారా ? అని ఆలోచించాను కానీ నా కళ్ళు తెరిపించింది మరో వార్త అదేంటంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పెనుగోలు అనే మారుమూల గ్రామస్థులు ఓటేయడం కోసం 16 కి.మీ నడిచారు. ఛత్తీస్‌ఘడ్ సరిహద్దులో ఉండే పెనుగోలు నుంచి ఓటేయడానికి కొండలు గుట్టలు దిగి, వాగులు వంకలు దాటి పోలింగ్ బూత్‌కు చేరుకున్నారు. కుగ్రామమైన పెనుగోలులో 56 మందికి ఓటు హక్కు ఉండగా అందులో 50 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. చంటి పిల్లలు ఉండటంతో మిగతా ఆరుగురు ఓటేయడానికి రాలేకపోయారని ఆ వార్త ఉపోద్ఘాతం. అంటే ఓటు వేయడం కోసం ఉదయాన్నే 8 గంటలకు నడక మొదలుపెట్టిన వారు మధ్యాహ్నం 12.30 గంటలకు పోలింగ్ బూత్ వద్దకు చేరుకున్నారు.

70 ఏళ్ల ముసలమ్మ నుంచి 18 ఏళ్ల యువకుడి వరకూ ఉత్సాహంగా ఓటేశారు. పది మంది పండు ముసలి వారు కూడా ఓటేయడం విశేషం. నన్ను ఇంకా ఆశ్చర్య పరిచిన విషయం ఏంటంటే ఓటేయడం కోసం వృద్ధులు ముందు రోజు రాత్రే నడక మొదలుపెట్టారు. గతంలో తమ ఊరి నుంచి వచ్చి మైదాన ప్రాంతంలో స్థిరపడిన కొందరు వీరికి ఆశ్రయం కల్పించారు. ఓటేయకపోతే ప్రభుత్వ రికార్డుల ప్రకారం మనం చనిపోయినట్టేనని తమ పూర్వీకులు చెప్పారని అందుకే ఓటేయడం సంప్రదాయంగా మారిందని ఒకరు చెప్పడం నిజంగా కళ్ళు చేమర్చేలా చేసింది. మరో దారుణమైన విషయం ఏంటంటే తమ గ్రామంలో కనీస వసతులు లేకపోవడంతో పోలింగ్ బూత్ వద్ద ఆందోళన చేపడదామని పెనుగోలు వాసులు భావించారు. కానీ రాజకీయ నాయకులెవరూ అక్కడ లేకపోవడంతో తమ ఆలోచనను విరమించుకున్నారు. అంటే వారి ఊరికి కనీస వసతులు లాంటివి లేకపోయినా తమ హక్కుగా వోటును ఉపయోగించుకున్నారు. కానీ ఎన్నికల సందర్భంగా సెలవు ఇచ్చి మహా అర కిలోమీటర్ దూరంలో పోలింగ్ బూత్. అయినా దాదాపు సగం మంది హైదరాబాదీలు ఓటేసేందుకు ఆసక్తి చూపలేదు. ఉన్నత విద్యావంతులైనప్పటికీ ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ ఓటేయడానికి మాత్రం బద్దకించారు. కానీ చదువు లేకున్నా మారుమూల ప్రాంతాలకు చెందిన గిరిజనులు మాత్రం ఓటేయడానికి ఉత్సాహం చూపారు. ఇలాంటప్పుడే అనిపిస్తుంది విద్య బుద్దులు నేర్పాలి కానీ బుద్దులు మండగించేలా చేయకూడదు అని.