బీఆర్ఎస్ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పించాలి: కిషన్ రెడ్డి

Election Updates: Kishan Reddy made a key announcement on BJP's second list
Election Updates: Kishan Reddy made a key announcement on BJP's second list

బీజేపీకి మద్దతు తెలిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. రజాకారుల వారసులతో బీఆర్ఎస్ నేతలు జట్టు కట్టి తమను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పించాలని అన్నారు. మహిళా రిజర్వేషన్లకు మద్దతు ఇవ్వని ఎంఐఎంతో కలిసి బీఆర్ఎస్ పనిచేస్తోందని.. మరోవైపు కాంగ్రెస్‌ ఎంపీలు కూడా మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఓటింగ్‌లో పాల్గొనలేదని చెప్పారు. బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు.

ఈ సమావేశానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అధ్యక్షతన ఘట్‌కేసర్ వీబీఐటీ కళాశాలలో కౌన్సిల్ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో కౌన్సిల్ పలు రాజకీయ తీర్మానాలు ఆమోదించనుంది. పార్టీ నిర్మాణం, కేంద్ర పథకాలపై సమావేశంలో చర్చ జరుగుతోంది. మిలియన్ మార్చ్, సాగర హరానికి రాని కేసీఆర్ తెలంగాణ తాను తెచ్చినట్లు గొప్పలు చెబుతున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ భూములు, మద్యం అమ్మందే పాలన సాగే పరిస్థితి లేదని.. బీఆర్ఎస్ నేతలు, కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోచుకుంటున్నారని ఆరోపించారు.

“రాష్ట్రాన్ని ప్రజాస్వామ్య తెలంగాణగా నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. దేశంలో ఏ మార్పు రావాలన్న బీజేపీ వల్లే సాధ్యం. మహిళలను అవమానించే రాజకార్ల పార్టీ హైదరాబాద్ లో పుట్టింది. మజ్లీస్ మహిళా రిజర్వేషన్లను వ్యతిరేకించింది. కేసీఅర్ కూడా మహిళా వ్యతిరేకి. కేసీఆర్ తొలి మంత్రివర్గంలో ఐదేళ్లు మహిళకు చోటు కల్పించకుండా పాలించారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముగ్గురు ఎంపిలు మహిళా బిల్లు ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. మహిళల ఓట్లు అడిగే అర్హత కాంగ్రెస్ కు లేదు.” అని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు.