జగన్ రాక…ఠాకూర్ పోక….సవాంగ్ కే ఛాన్స్ ?

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ పనితీరుపై తీవ్ర అభ్యంతరాలు తెలిపిన వైసీపీ అధికారంలోకి రాగానే ఆయనకు ఉద్వాసన పలికేందుకు రంగం సిద్ధం చేసింది. ఆయన స్ధానంలో ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను నియమించాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఆయన విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్‌గా ఉన్నారు. దీంతో తన ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లను పర్యవేక్షించే బాధ్యతలను సైతం గతమ్ సవాంగ్ కే జగన్ అప్పగించారు. 1986 బ్యాచ్ కి చెందిన సవాంగ్ ఉమ్మడి ఏపీలో మదనపల్లి ఏఎస్పీగా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించి, ఆపై చిత్తూరు, వరంగల్ జిల్లాల్లో ఎస్పీగా, వరంగల్ రేంజ్, హోమ్ గార్డ్ డీఐజీగా, ఎస్ఐబీ, ఏపీఎస్పీ డీఐజీగానూ పరిశీలించారు. డిప్యుటేషన్ పై మూడేళ్లపాటు లైబీరియాలో ఐరాస పోలీసు కమిషనర్ గానూ పనిచేశారు. 2015 నుంచి 2018 వరకూ విజయవాడ పోలీసు కమిషనర్ గా పనిచేసి తనదైన ముద్ర వేశారు. ఇక సవాంగ్ నియామకంపై త్వరలోనే ఉత్తర్వులు వెలువడతాయని తెలుస్తోంది. గత సంవత్సరం జూలైలో డీజీపీగా బాధ్యతలు చేపట్టిన ఠాకూర్, 11 నెలల పాటు పదవిలో కొనసాగి పదవీ విరమణ చేయనుండగా, ఆ వెంటనే సవాంగ్ డీజీపీగా బాధ్యతలు చేపడతారని తెలుస్తోంది. గతేడాది జులై 1న ఆర్‌.పి.ఠాకూర్‌ డీజీపీగా బాధ్యతలు చేపట్టి 11 నెలలుగా పదవిలో కొనసాగుతున్నారు. డీజీపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు బంతులా పనిచేస్తున్నారాని వైసీపీ నేతలు కొంత కాలం తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఎన్నికల విధుల నుంచి ఆయన్ని తప్పించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. అయితే ఈసీ వారి విన్నపాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు వైసీపీ అధికారంలోకి రావడంతో ఠాకూర్‌కు వెంటనే ఉద్వాసన పలుకుతున్నారు.