పంద్రాగస్టు ముందు రోజు విషాదం…జెండా దిమ్మ పట్టుకుని ముగ్గురు చిన్నారులు మృతి

the-tragedy-of-the-day-before-pandragast-three-little-kids-died-after-holding-a-flag-boil

ప్రకాశం జిల్లాలో పంద్రాగస్టు ముందురోజున విషాదం చోటుచేసుకుంది. సంతమాగులూరు మండలం కొప్పర గ్రామంలో ముగ్గురు చిన్నారులు కరెంట్ షాక్‌తో ప్రాణాలు కోల్పోయారు. గ్రామంలోని కోదండరామస్వామి ఆలయ ప్రధాన కూడలి వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన జెండాను ఆ పార్టీ నేతలు ఏర్పాటుచేశారు.

బుధవారం ఉదయం ముగ్గురు చిన్నారులు ఆ స్తంభాన్ని పట్టుకోగానే షాక్ కొట్టింది. చిన్నారుల కేకలు విన్న స్థానికులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నా అప్పటికే వారి శరీరాలు తీవ్రంగా కాలిపోవడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు.

మృతులను ఐదో తరగతి విద్యార్దులు షేక్ పఠాన్ గౌస్(11), షేక్ హసన్ బుడే(11), పఠాన్ అమర్ (11)గా గుర్తించారు. పార్టీ జెండా స్తంభానికి కరెంట్ తీగలు తగలడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు గుర్తించారు.

ముగ్గురు విద్యార్థుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పార్టీ జెండాను కరెంట్ తీగలు తగిలే చోట్ల ఏర్పాటు చేయడం వల్లనే ప్రమాదం జరిగిందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.