టీడీపీ అవిశ్వాసం తెలంగాణ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటాం !

TRS MPs to Participate In No-Confidence Motion Says MP

ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చలేదంటూ కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి టీఆర్ఎస్ పార్టీ మద్దతు ప్రకటించలేదు. అయితే కేంద్రం నుంచి ఏపీ ప్రత్యేక ప్రోత్సాహకాలు కోరితే తాము వ్యతిరేకిస్తామని టీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్ష నేత వినోద్‌కుమార్‌ ప్రకటించారు. విభజన చట్టంలో పేర్కొన్న హామీల అమలుకు తమ పార్టీ కట్టుబడి ఉందని, ఈ అంశంలో గతంలో చెప్పినట్లే టీడీపీకి అండగా నిలుస్తామని చెప్పారు. కానీ, ఏపీకి ప్రత్యేక హోదా అన్నది విభజన చట్టంలో లేదని గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా లేనిదానిని కోరడమేంటని ప్రశ్నించారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ ఎంపీ వినోద్ మాట్లాడుతూ, టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం గొప్ప విషయమేమీ కాదని చెప్పారు. అవిశ్వాసంపై ఓటింగ్ పెడితే అందులో పాల్గొనాలా? లేదా? అనే విషయంపై ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

అవిశ్వాసంపై జరిగే చర్చలో మాత్రం పాల్గొంటామని విభజన హామీలపై కేంద్రాన్ని నిలదీస్తామని చెప్పారు. ఏపీ ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు ఇస్తే తెలంగాణకు నష్టం జరుగుతుందని, హైదరాబాద్‌ పరిశ్రమలు విజయవాడకు తరలివెళ్లే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. 2014లో తమిళనాడు అప్పటి ముఖ్యమంత్రి జయలలిత కూడా ఇదే అంశంపై కేంద్రానికి లేఖ రాశారని, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వవద్దని కోరారని తెలిపారు. కర్ణాటక అప్పటి ముఖ్యమంత్రి సిద్దరామయ్య కూడా ఇలాగే స్పందించారని అసలు కేంద్రంపై అవిశ్వాసానికి మద్దతు ఇవ్వాలని టీడీపీ తమను డిమాండ్‌ చేయడం అర్ధరహితమని, నాలుగేళ్లపాటు టీడీపీ బీజేపీ జట్టు కట్టినప్పుడు తాము దాని గురించి అడగలేదని గుర్తు చేశారు. అవిశ్వాసంపై చర్చను తెలంగాణ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటామన్నారు.