పాక్ ప్రధానికి ట్రంప్ వార్నింగ్…జాగ్రత్తగా మాట్లాడమని !

Trump Warning to Pak Prime Minister ... Speak With Care!

భారత్‌పై బురద జల్లేందుకు ఎన్ని కుట్రలు చేయాలో అన్ని చేస్తోంది పాకిస్థాన్‌. జమ్మూకాశ్మీర్‌ భారత్‌ అంతర్గత వ్యవహారం అయినప్పటికీ దీన్ని వివాదం చేస్తోంది. ఇప్పటికే ఐక్యరాజ్యసమితో ఎదురు దెబ్బలు తిన్న పాక్‌.. తాజాగా కశ్మీర్‌ అంశంపై అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెబుతోంది.

మరోవైపు మోడీతో మాట్లాడిన గంటల వ్యవధిలోనే పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌తోనూ మాట్లాడారు ట్రంప్‌. కశ్మీర్‌ అంశంపై భారత్‌తో మితంగా మాట్లాడాలని చురకలంటించారు. ఇరు దేశాలు సంయమనం పాటించాలని హితవు పలికారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు చేసిన తర్వాత భారతపై పాకిస్తాన్‌ కుట్రలు చేస్తోంది.

భారత్‌కు వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్న దాయాది దేశానికి అడుగడుగునా ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికా సహా రష్యా కశ్మీర్‌ అంశంలో భారత్‌ను సమర్థించాయి.

దీంతో కంగుతిన్న పాకిస్తాన్‌ తన మిత్రదేశమైన చైనా సహాయంతో ఐక్యరాజ్యసమితిలో కశ్మీర్‌ అంశాన్ని చర్చించే దిశగా పావులు కదిపింది. ఈ క్రమంలో చైనా జోక్యంతో యూఎన్‌ భద్రతా మండలిలో గత శుక్రవారం కశ్మీర్‌ విషయమై రహస్య సమావేశం జరిగింది.

కానీ, యూఎన్‌ శాశ్వత సభ్యదేశాలైన అమెరికా, రష్యా, ఫ్రాన్స్‌, యూకే ఇది భారత్‌-పాక్‌ల ద్వైపాక్షిక అంశమని స్పష్టం చేశాయి. దీంతో అంతర్జాతీయ వేదికపై భారత్‌ను దోషిని చేద్దామనుకున్న పాకిస్తాన్‌కు చుక్కెదురైంది. అయితే.. తాజాగా కశ్మీర్‌ అంశంపై అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పారు పాక్‌ విదేశాంగ మంత్రి షా మహ్మద్‌ ఖురేషి.

ఇందుకు సంబంధించి చట్టబద్ధ అంశాలను చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారాయన. ఇటు ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడిన కొన్నిగంటల వ్యవధిలోనే పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌తోనూ ఫోన్‌లో మాట్లాడారు ట్రంప్‌. జమ్మూకశ్మీర్‌ అంశంపై భారత్‌తో మితంగా మాట్లాడాలని ఇమ్రాన్‌కు ట్రంప్‌ సూచించినట్లు శ్వేత సౌధం వర్గాలు ప్రకటించాయి.

వారం రోజుల వ్యవధిలో వీరివురి మధ్య సంభాషణలు సాగడం ఇది రెండోసారి. రెండు రోజుల క్రితం ఇమ్రాన్‌ భారత ప్రభుత్వంపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. దీన్ని మోడీ ట్రంప్‌తో సాగిన ఫోన్‌ సంభాషణలో ఎండగట్టారు. ఇలాంటి వ్యాఖ్యలు ప్రాంతీయంగా ఆందోళనలు రెచ్చగొట్టే అవకాశం ఉందని వివరించారు.

భారత్‌ వాదనను అర్థం చేసుకున్న ట్రంప్‌ మోడీతో మాట్లాడిన గంటల వ్యవధిలోనే ఇమ్రాన్‌కు హితబోధ చేసినట్లు అర్థమవుతోంది. అలాగే ప్రస్తుతం నెలకొన్న ఆందోళనకర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఉభయ దేశాలూ సంయమనం పాటించాలని ట్రంప్‌ సూచించారు. ఉగ్రవాదానికి ముగింపు పలికాలని పాక్‌కు సూచించారు ట్రంప్‌. ఆ తర్వాత ట్వీట్‌ చేశారాయన. మోడీ, ఇమ్రాన్‌తో సంభాషణ చక్కగా సాగిందని పేర్కొన్నారు.