ఈ ఐదు గుర్తిస్తే మీ జీవితం స్వర్గం…

Turkish poet RUMI says about 5 truths of life

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
చదువు పాఠాలు చెప్పి పరీక్ష పెడుతుంది. జీవితం పరీక్ష పెట్టి గుణపాఠాలు నేర్పుతుంది. అందుకే బతుకు బండి సాఫీగా లాగడం కష్టం అయిపోతోంది. లేని వాడికి లేదనే చింత, ఉన్నవాడికి దాన్ని కాపాడుకోవడమే పెద్ద బాధ. ఎందుకు జీవితం ఇంత క్లిష్టం అవుతోంది ? . నిజంగా హాయిగా జీవించడం అంత కష్టమా ?. ఇలాంటి ప్రశ్నలు తరచూ వస్తూ ఉంటాయి. అయితే వాటికి సరళమైన, సంక్షిప్తమైన సమాధానాలే దొరకవు. పైగా మనం కూడా ఎప్పటికప్పుడు ఎదురయ్యే సమస్య కి పరిష్కారం మీద దృష్టి పెట్టడమో లేక దాని నుంచి తప్పించుకోవడమో చేస్తాం. కానీ తరచూ అదే అనుభవాలు ఎదురవుతుంటే దురదృష్టం అని ఇంకో మాట చెప్పుకుని ఇంకాస్త విచారంలో మునిగిపోతాం. కానీ నిజానికి మనకి కావాల్సింది ఈ విచారం కాదు. సమస్య మూలాల్ని కనిపెట్టే విచారణ కావాలి. జీవితాన్ని సమగ్రంగా అర్ధం చేసుకుని ముందుకెళ్లే పరిణితి రావాలి. అయితే ఉరుకులపరుగుల జీవితంలో అంత సమయం ఎక్కడ ?. అందుకే కొందరు మహానుభావులు జీవితాన్ని మధించి,శోధించి అమృతపు బిందువుల్లాంటి సారాన్ని అందించారు.

మన జీవితాన్ని స్వర్గతుల్యం చేసుకునేందుకు అద్భుత బోధనలు చేసిన వారిలో ప్రఖ్యాత టర్కిష్ కవి రూమి ఒకరు. దేశకాలమానాలకి అతీతమైన ఆయన బోధలు సంతోషకర జీవితానికి ఐదు మెట్లు లాంటివి. ఓ ఐదు విషయాల్ని జాగ్రత్తగా పరిశీలిస్తే, గుర్తిస్తే, ఆ ఎరుకతో ప్రవర్తిస్తే మన జీవిత నౌక సాఫీగా సంసార సాగరాన్ని దాటేస్తుంది. ఇంతకీ రూమి చెప్పిన ఆ ఐదు విషయాలు , మన జీవితాల్ని గమ్యం లేకుండా చేస్తున్న ఆ ఐదు శత్రువులు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

1 . ఏది విషం ?

మన అవసరానికి మించినది ఏదైనా విషమే. అది అధికారం, సంపద, ఆకలి, అహం, దురాశ, బద్ధకం, ప్రేమ , కోరిక, ద్వేషం… ఇలా ఏ లక్షణం అయినా పరిధి,పరిమితికి మించి ఉంటే అది మన జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తుంది. ప్రేమని కూడా ఈ జాబితాలో చేర్చారంటే జీవితాన్ని ఎంత సమతుల్యంతో నడుపుకోవాలో అర్ధం అవుతుంది. ఇలా అతికి దూరం అయితే అంతా మంచే.

2 . ఏది భయం?

మన జీవితాన్ని అతలాకుతలం చేసే వాటిలో రెండో శత్రువు భయం. నిజానికి భయం అంటే ఏదైనా చెడు జరుగుతుందన్న ఆలోచనతో కలిగే మానసిక ఒత్తిడి భయం అనుకుంటాం. కానీ నిజానికి కాస్త లోతుగా పరిశీలిస్తే అసలు సత్యం బోధపడుతుంది, జీవితంలో ప్రతీది నిర్దిష్టంగా ఉండాలి అనుకుంటాం. అందుకే అనిశ్చిత పరిస్థితులు ఎదురు అయినప్పుడు భరించలేము. సహించలేం. కానీ ఎప్పుడైతే ఆ అనిశ్చితిని మనసు ఒప్పుకుంటుందో భయం స్థానంలో సాహసం చేస్తున్న అనుభూతి కలుగుతుంది. భయం పోయి ధైర్యం మిగిలిపోతుంది.

3 . ఏది అసూయ?

మనలోనే పుట్టి మననే దహించివేసే అగ్గిరవ్వ ఈ అసూయ. మన జీవితాల్ని ఛిద్రం చేస్తున్న ఈ మూడో శత్రువుని ఎదుర్కోడానికి ఓ చిన్న చిట్కా పాటిస్తే చాలు. ఇతరుల మంచిని ఒప్పుకోకపోవడమే అసూయ. కానీ వారి మంచిని ఒక్కసారి ఒప్పుకుని చూస్తే అసూయ స్థానంలో స్ఫూర్తి రగులుతుంది. అదే మనలో చెడుని సంహరిస్తుంది.

4 . ఏది కోపం ?

మనల్ని మనిషి నుంచి రాక్షసుడిగా మార్చే శక్తి ఈ కోపానికి వుంది. అసలు కోపం అంటే ఏమిటో తెలుసుకుంటే దాన్ని జయించడం సులభతరం అవుతుంది. మన పరిధిలో లేని అంశాల్లో మనకి నచ్చనివి జరుగుతున్నప్పుడు వచ్చేదే కోపం. చాలా సందర్భాల్లో మనం కోపం తెచ్చుకున్నా అవేమీ మారవు. అప్పుడు మన పరిధిలో లేని అంశాల్ని యధాతధంగా ఒప్పుకుని చూస్తే కోపం స్థానాన్ని సహనం భర్తీ చేస్తుంది.

5 . ఏది ద్వేషం ?

మనల్ని కుదురుగా ఉండనీయకుండా చేసే వాటిలో ద్వేషం ముఖ్యమైనది. దీన్ని అధిగమించాలి అంటే ముందు అదేమిటో తెలుసుకోవాలి. ఒక మనిషిని లేదా పరిస్థితిని వున్నది ఉన్నట్టు అంగీకరించలేకపోవడమే ద్వేషం. భేషరతుగా ఆ మనిషిని లేదా సంఘటనని అంగీకరిస్తే ద్వేషం పోయి ప్రేమ మొలకెత్తుతుంది.

రూమి చెప్పిన ఈ ఐదు వజ్రాల్లాంటి విషయాల్ని మన జీవితాలకి అన్వయం చేసుకుని పాటించి చూస్తే సంసార సాగరాన్ని ఆడుతూపాడుతూ ఈదడం ఖాయం.