యువతికి 2 కోట్లు నష్ట పరిహారం

యువతికి 2 కోట్లు నష్ట పరిహారం

హోటల్‌లోని సెలూన్ నిర్వాకం వల్ల మోడలింగ్‌లో తాను అవకాశం కోల్పోయానని, అందుకు తనకు నష్టపరిహారం చెల్లించేలా ఆదేశాలు జారీచేయాలని ఓ యువతి వినియోగదారుల కోర్టును ఆశ్రయించింది. సెలూన్‌ నిర్లక్ష్యం కారణంగా మోడలింగ్‌లో రాణించాలనే తన కలలు చెదిరిపోయాయని పేర్కొంది. యువతిని పిటిషన్‌పై విచారణ చేపట్టిన జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ .. ఆమె వాదనలతో ఏకీభవించింది.

యువతికి గా రూ.2 కోట్లు పరిహారం చెల్లించాలని గురువారం ఆదేశించింది.‘మూడేళ్ల కిందట మహిళ సూచనలకు విరుద్దంగా జుత్తు కత్తిరించడంతో ఆమె ఆశించిన రంగంలో అవకాశం కోల్పోయింది.. భారీ నష్టాన్ని చవిచూసింది.. ఇది ఆమె జీవనశైలిని పూర్తిగా మార్చివేసింది.. టాప్ మోడల్ కావాలనే తన కల చెదిరిపోయింది’ అని ఎన్‌డీఆర్సీ వ్యాఖ్యానించింది.

‘యువతికి తన జుట్టు విషయంలో చాలా జాగ్రత్తలు, సంరక్షణ తీసుకుందనే విషయంలో ఎటువంటి సందేహం లేదు.. తన కేశ సౌందర్యం కోసం చాలా మొత్తం ఖర్చుచేసింది.. దానితో ఆమె ఓ ఉద్వేగపూరిత అనుబంధాన్ని పెనవేసుకుంది.. ఆమె పొడవాటి జుట్టు కారణంగా దానికి సంబంధించి ఉత్పత్తులకు మోడలింగ్ చేసింది.. ఆమె VLCC, Pantene వంటి ఉత్పత్తులకు మోడల్‌గా వ్యవహరించింది’ అని ఎన్సీడీఆర్సీ ఛైర్మన్ ఆర్కే అగర్వాల్, సభ్యుడు ఎస్ఎం కంతికార్ అన్నారు.

హోటల్ సెలూన్ నిర్లక్ష్యం కారణంగా ఆమెకు మోడలింగ్‌లో అవకాశం చేజారడంతో తీవ్ర మానసిక వేదనకు గురయ్యిందన్నారు. ఓ ఇంటర్వ్యూకు హాజరుకావడానికి వారం ముందు 2018 ఏప్రిల్ 12న తరుచూ వెళ్లే హోటల్ సెలూన్‌కు వెళ్లినట్టు యువతి ఫిర్యాదులో పేర్కొంది. ఎప్పుడూ తనకు హెయిర్ డ్రెస్సింగ్ చేసే వ్యక్తి లేకపోవడంతో ఆ పనిని మరొకరికి అప్పగించారు.. దీనిపై అభ్యంతరం తెలపడంతో తను కూడా బాగానే డ్రెస్సింగ్ చేస్తుందని చెప్పి నిర్వాహకులు ఒప్పించారని తెలిపింది.

కోర్టు తన ఉత్తర్వుల్లో ‘‘ఆ మహిళ ప్రత్యేకంగా ముందు, వెనుక భాగంలో తన ముఖాన్ని కప్పే పొడవైన ఫ్లిక్స్, కింద నుంచి 4 అంగుళాల స్ట్రెయిట్ హెయిర్ ట్రిమ్ చేయాలని కోరింది.. కానీ దీనికి విరుద్ధంగా ఆమె పొడవాటి జుట్టును కత్తిరించారు.. పై నుంచి నాలుగు అంగుళాలు మాత్రమే వదిలి పెట్టారు… ఒక సాధారణ హెయిర్ కట్‌కు ఒక గంట కంటే ఎక్కువ సమయం తీసుకోవడంపై అనుమాన వచ్చి ప్రశ్నిస్తే లండన్ హెయిర్‌కట్ చెప్పాడు… సెలూన్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో హోటల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది..

అయినా ఫలితం లేకపోయిందని బాధిత మహిళ చెప్పింది. తరువాత, కూడా సెలూన్‌కి హెయిర్ ట్రీట్మెంట్ కోసం వెళితే అమోనియా రసాయం వల్ల మాడు కాలి, జుట్టు రఫ్‌గా మారిందని భావించి బయటకు వచ్చింది. దీంతో తీవ్రంగా కలత చెందిన బాధితురాలు.. వేధింపులు, అవమానం, మానసిక కుంగుబాటు గురయ్యాయని, పరిహారంతో పాటు హోటల్ నుంచి లిఖితపూర్వకంగా క్షమాపణలు కోరుతూ ఫిర్యాదు చేసింది’’ అని పేర్కొంది.

అయితే, హోటల్ భిన్నమైన వాదనలు వినిపించింది. ఆమె కార్డు తిరస్కరణకు గురికావడంతో జుట్టును ఉచితంగా కత్తిరించామని తెలిపింది. దీనికి ఎటువంటి ఛార్జీలు వసూలు చేయాలని పేర్కొంది. కాబట్టి వినియోగదారుగా పరిహారం పొందే అర్హత లేదని వాదించింది. ఆమె అడిగిన పరిహారం అతిశయంగా, ఎటువంటి ఆధారం లేకుండా ఉందని తెలిపింది. అంతేకాదు, హోటల్ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించింది.