లామినే డియాక్‌కు రెండేళ్ల జైలు శిక్ష

లామినే డియాక్‌కు రెండేళ్ల జైలు శిక్ష

అంతర్జాతీయ అథ్లెటిక్స్‌ సమాఖ్య (ఐఏఏఎఫ్‌) మాజీ అధ్యక్షుడు లామినే డియాక్‌కు రెండేళ్ల జైలు శిక్ష పడింది. రష్యా డోపీలను నిషేధించకుండా పోటీల్లో పాల్గొనేలా అవినీతికి పాల్పడటంతో పారిస్‌ కోర్టు 87 ఏళ్ల డియాక్‌ను దోషిగా తేల్చి శిక్ష ఖరారు చేసింది. సెనెగల్‌ దేశానికి చెందిన ఆయన 1999 నుంచి 2015 వరకు సుదీర్ఘకాలం పాటు ఐఏఏఎఫ్‌లోనే అత్యంత ప్రభావవంతమైన అధ్యక్షుడిగా పనిచేశారు. అయితే ఆయన పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.

దీనిపై విచారించిన కోర్టు జైలుశిక్షతోపాటు 5 లక్షల యూరోలు (రూ. 4 కోట్ల 34 లక్షలు) జరిమానా కూడా విధించింది. శిక్ష ఖరారు చేస్తున్న సమయంలో డియాక్‌ కోర్టులోనే ఉన్నారు. ఆయన అవకతవకలు, అవినీతి ఉదంతాలపై ఈ శిక్షను విధిస్తున్నట్లు మహిళా న్యాయమూర్తి తీర్పును చదివి వినిపించారు. రష్యా డోపీలకు ఉద్దేశపూర్వకంగానే అండదండలు అందించినట్లు కోర్టు తేల్చిందని ఆమె చెప్పారు.