తాజ్ మ‌హ‌ల్ సంద‌ర్శించిన యోగీ…

up cm yogi adityanath visits Taj Mahal
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
వరుస వివాదాల నేప‌థ్యంలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగీ ఆదిత్య‌నాథ్ ప్ర‌ముఖ చారిత్ర‌క క‌ట్ట‌డం తాజ్ మ‌హ‌ల్ ను సంద‌ర్శించారు. కార్య‌క‌ర్త‌ల‌తో క‌లిసి అక్క‌డ‌కు చేరుకున్న యోగీ తాజ్ మ‌హ‌ల్ పశ్చిమ గేటు ద‌గ్గ‌ర స్వ‌చ్ఛ భార‌త్ లో పాల్గొన్నారు. ముఖానికి మాస్క్, చేతుల‌కు గ్లౌజులు తొడుక్కుని చీపురు పట్టుకుని రోడ్లు ఊడ్చారు. స్వచ్బ భార‌త్ అనంత‌రం క‌ట్ట‌డాన్ని సంద‌ర్శించారు. అక్క‌డి విదేశీప‌ర్యాట‌కుల‌తో క‌లిసి ఫొటోలు దిగారు. సీఎం వెంట రాష్ట్ర ప‌ర్యాట‌క మంత్రి రీటాబ‌హుగుణ జోషి కూడా ఉన్నారు. యోగీ ప‌ర్య‌ట‌నకు ఆగ్రా అధికారులు 14వేల‌మంది పోలీసుల‌తో విస్తృత భ‌ద్ర‌త క‌ల్పించారు. తాజ్ మ‌హ‌ల్ పై వివాదం నేప‌థ్యంలో యోగీ అక్క‌డ ప‌ర్య‌టించ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.
 UP CM in Taj Mahal
యూపీలో బీజేపీ ప్ర‌భుత్వం ఆరునెల‌ల పాల‌నాకాలం పూర్తిచేసుకున్న సంద‌ర్భంగా ప‌ర్యాట‌క ప్రాంతాల‌తో ఒక బుక్ లెట్ విడుద‌లచేసింది. ఇందులో తాజ్ మ‌హ‌ల్ పేరు లేక‌పోవ‌డంతో వివాదం చెల‌రేగింది. అయితే స‌మాచార లోపం వ‌ల్లే ఈ త‌ప్పిదం జ‌రిగింద‌ని యూపీ ప్ర‌భుత్వం వివ‌ర‌ణ ఇచ్చింది. తాజ్ మ‌హ‌ల్ చారిత్ర‌క వార‌స‌త్వ సంప‌ద‌ని ప‌ర్యాట‌క మంత్రి రీటాబహుగుణ జోషి చెప్పారు. సీఎం యోగీ కూడా తాజ్ మ‌హ‌ల్ భార‌త్ కు గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని, అభివృద్ది కోసం రూ. 370కోట్లు ఖ‌ర్చు చేయ‌నున్నామ‌ని ప్రక‌టించి వివాదాన్ని ముగించే ప్ర‌య‌త్నం చేశారు. అయితే ఉత్త‌ర‌ప్ర‌దేశ్ బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రం వివాదాన్ని కొన‌సాగించారు. చారిత్ర‌క క‌ట్ట‌డంపై కొత్త వాద‌న‌లు వినిపించారు. తాజ్ మ‌హ‌ల్ దేశ‌ద్రోహులు నిర్మించిన కట్ట‌డ‌మ‌ని ఎమ్మెల్యే సంగీత్ సోము వ్యాఖ్యానించగా… ఎంపీ విన‌య్ క‌తియారు… మ‌రింత వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు.
తాజ్ మ‌హ‌ల్ ఒక‌ప్పుడు శివాల‌య‌మ‌ని, తేజో మ‌హాల‌య్ గా పిలిచేవార‌ని, షాజ‌హాన్ ఆ ఆల‌యాన్ని కూల్చివేసి తాజ్ మ‌హ‌ల్ నిర్మించార‌ని విన‌య్ క‌తియార్ చరిత్ర‌కు కొత్త భాష్యం చెప్పారు. దీనిపై దేశ‌వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కేంద్రంలోనూ, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోనూ తిరుగులేని అధికారం చెలాయిస్తున్న బీజేపీ… తాజ్ మ‌హ‌ల్ ను కూడా వివాదాస్ప‌ద ప్రాంతంగా మార్చివేసే య‌త్నంచేస్తోద‌న్న ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.  దేశ‌వ్యాప్తంగా దీనిపై ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. సామాన్యులే కాదు… సెల‌బ్రిటీలు కూడా తాజ్ మ‌హ‌ల్ వివాదంపై విమ‌ర్శ‌లు చేయ‌డం ప్రారంభించారు.
prakash raj comments on Taj Mahal
ఇటీవ‌లే విల‌క్ష‌ణ‌న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ తాజ్ మ‌హ‌ల్ ను ఎప్పుడు కూల్చేస్తారో చెబితే… చివ‌రిసారిగా మా పిల్ల‌ల‌కు చూపిస్తానంటూ ట్విట్ట‌ర్ లో వ్యంగ్యంగా చేసిన వ్యాఖ్య‌లు చూస్తే… తాజ్ మ‌హ‌ల్ మ‌రో రామ‌జ‌న్మ‌భూమి అయ్యే ప్ర‌మాదం ఉంద‌ని ప్ర‌జ‌లు భావిస్తున్న‌ట్టు అర్ధ‌మవుతోంది. మ‌రి ఈ వివాదం ఎక్క‌డిదాకా వెళ్తుందో చూడాలి. అటు యోగీ తాజ్ మ‌హ‌ల్ వ‌ద్ద స్వ‌చ్ఛ భార‌త్ లోపాల్గొన‌డంపై ఎంఐఎం ఎంపీ అస‌దుద్దీన్ ఓవైపీ విమ‌ర్శ‌లు గుప్పించారు. తాజ్ మ‌హ‌ల్ ద‌గ్గ‌ర రోడ్లు ఊడ్చ‌డం కన్నా యోగీ… త‌న పార్టీ నేత‌లు, కేబినెట్ మంత్రుల మెద‌ళ్లును శుభ్ర‌ప‌ర్చితే బాగుంటుంద‌ని అస‌దుద్దీన్ ఎద్దేవా చేశారు.