మోడీ-షా లకి మరో భారీ షాక్ !

upendra kushwaha shokes amit shah and narendra modi

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మరో పార్టీ నుంచి ఊహించని షాక్ తగిలింది. జాతీయ ప్రజాస్వామిక కూటమి (ఎన్డీయే) నుంచి వైదొలుగుతున్నట్టు మరో పార్టీ ఎన్డీయేకి షాక్ ఇచ్చింది. ఇప్పటికే ఒకపక్క టీడీపీ మరోపక్క అకాలీధళ్ ఇంకోపక్క శివసేనలు ఎన్డీయేకి షాక్ ఇవ్వగా ఇప్పుడు అదే కోవలో మరో పార్టీ వారికి భారీ షాక్ నే ఇచ్చింది. సీఎం నితీశ్ కుమార్ వైఖరికి నిరసనగా… ఇవాళ పాట్నాలో జరుగుతున్న ఎన్డీయే సమావేశాన్ని కేంద్రమంత్రి, ఆర్ఎల్ఎస్పీ చీఫ్ ఉపేంద్ర కుష్వాహ బహిష్కరించారు. అలాగే తమ రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (ఆర్ఎల్ఎస్పీ) ఎన్డీయే నుండి నిష్క్రమిస్తున్నట్టు ప్రకటించింది. దీంతో ఎన్డీయే మిత్రపక్షాలన్నిటినీ ఏకతాటిపైకి తేవాలన్న బీజేపీ ప్రయత్నాలకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలినట్టైంది.

బీహార్‌లో గత లోక్‌సభ ఎన్నికలకు ముందు అంటే 2013లో మోడీని బిజెపి ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే దానికి వ్యతిరేకంగా ఎన్డీయేతో తెగతెంపులు చేసుకున్న జెడి(యు) గత ఏడాది ఏప్రిల్‌లో తిరిగి బిజెపితో చేతులు కలిపినప్పటికీ సీట్ల పంపిణీ దగ్గరకొచ్చేసరికి రెండు పార్టీలు శిగపట్లు పట్టుకుంటున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో నితీష్‌ నేతృత్వంలోనే ఎన్డీయే పోటీ చేయాలని జెడి(యు) వాదిస్తుండగా, మోడీ నాయకత్వంలోనే వెళ్లాలని బిజెపి పట్టుపడుతున్నది. బీహార్‌లోని మొత్తం 40 పార్లమెంటు స్థానాలకు గాను 25 స్థానాలకు తాను ఈ సారి పోటీ చేస్తానని జెడి(యు) నేత, ముఖ్యమంత్రి చెప్పారు. గత లోక్‌సభ ఎన్నికల్లో బీహార్‌లో 22 స్థానాలు సొంతంగా, మిత్రపక్షాలైన ఎల్‌జెపి( 6), ఆర్‌ఎల్‌ఎస్‌పి (3)తో కలసి ఎన్డీయేగా 31 స్థానాలు సాధించిన బిజెపి ఇప్పుడు వాటిని తగ్గించుకోవడానికి సిద్ధ పడడం లేదు. అలాగే ఇప్పుడు 2019 ఎన్నికల్లో బీహార్ ఎన్డీయే సారథిని తానేనంటూ నితీశ్ కుమార్ ప్రకటించుకోవడంపై కుష్వాహ తీవ్రంగా కలత చెందినట్టు ఆర్ఎల్ఎస్పీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఎన్డీయేకి గుడ్‌బై చెప్పిన ఆర్ఎల్ఎస్పీ… బీహార్ మహాకూటమిలో చేరేందుకు ఇప్పటికే ఆర్జేడీని సంప్రదించినట్టు వార్తలు వస్తున్నాయి.