కేంద్రానికి మరో ఎదురుదెబ్బ…ఆర్బీఐ గవర్నర్ రాజీనామా !

భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్ పదవికి రాజీనామా చేశారు. కొన్నాళ్ళ నుండి వార్తలు వస్తున్నట్టు గానే కేంద్రం వ్యవహార శైలిపై అసంతృప్తితో వున్న ఆర్బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్ తన పదవికి రాజీనామా చేశారు. కేంద్ర ప్రభుత్వానికి, ఆర్బీఐకు మధ్య గత కొంత కాలంగా దూరం పెరిగిన సంగతి తెలిసిందే. రిజర్వ్ బ్యాంకులో ఉన్న నగదు నిల్వల్లో కొంత భాగాన్ని తమకు ఇవ్వాలంటూ కేంద్రం ఒత్తిడి చేస్తోంది. ఈ ప్రతిపాదనను ఊర్జిత్ పటేల్ తో పాటు మరి కొందరు బోర్డు సభ్యులు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే, ఆయన రాజీనామా చేశారు. నిజానికి ఆయన గత నెల 19వ తేదీన ఆర్బీఐ బోర్డు సమావేశంలో రాజీనామా చేయాలనుకున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఆ బోర్డు సమావేశంలో కేంద్రం ఆర్బీఐ రాజీకి వచ్చినట్లు, ఓ ఒప్పందం చేసుకున్నట్లు ఆర్బీఐ వద్ద ఉన్న నగదు నిల్వలను కేంద్రానికి ఇవ్వడానికి ప్రత్యేకమైన కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే హఠాత్తుగా వ్యక్తిగత కారణాలు చూపుతూ ఆర్‌బీఐ గవర్నర్‌ పదవికి ఉర్జిత్‌ పటేల్‌ రాజీనామా చేసేశారు.

కేంద్రానికి మరో ఎదురుదెబ్బ...ఆర్బీఐ గవర్నర్ రాజీనామా ! - Telugu Bullet

ప్రభుత్వంతో విభేదించి అలసిపోవడమే కాక, వైరిపూరిత వాతావరణంలో పనిచేయడం వల్ల తన ఆరోగ్యం పాడవుతున్నదని పటేల్ తన సన్నిహితుల వద్ద చెప్పినట్లు మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇటీవలి కాలంలో కేంద్రం స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న ఆర్బీఐపై తన పెత్తనాన్ని రుద్దాలని ప్రయత్నించింది. ముఖ్యంగా రిజర్వ్‌బ్యాంక్ చట్టంలోని సెక్షన్-7 కింద ప్రభుత్వం ఆదేశాలను జారీచేసిందన్న ప్రచారం జరుగుతోంది. గతంలో ఆర్బీఐ గవర్నర్ రాజీనామా వార్తలు వచ్చినప్పుడు ఆర్‌బీఐ స్వయంప్రతిపత్తిని కాపాడుతామని కేంద్రం ప్రకటన చేసింది. ఆ సమయంలో ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ ఆర్‌బీఐ స్వయంప్రతిపత్తిని కాపాడాల్సిందేనంటూ బహిరంగంగా ఆర్‌బీఐకి మద్దతు పలికారు. రఘురామ్ రాజన్ కూడా బీజేపీ మార్క్ ఆర్థిక విధానాలు నచ్చకనే గవర్నర్ పదవి పొడిగింపు కోరలేదని ప్రచారం జరిగింది. 2016లో ఆర్బీఐ గవర్నర్ గా ఊర్జిత్ పటేల్ బాధ్యతలను స్వీకరించారు. 2019 సెప్టెంబర్ వరకు ఆయన పదవీకాలం ఉంది. ఊర్జిత్ పటేల్ హయాంలోనే పెద్దనోట్ల రద్దు జరిగింది. శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో ఈ అంశాన్ని విపక్షాలు అస్త్రంగా మలచుకునే అవకాశం ఉంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆర్థిక సేవల రంగం వివిధ కుంభకోణాలతో సతమతమవుతున్న తరుణంలో రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్ రాజీనామా చేయడం ప్రభుత్వానికి భారీ ఎదురుదెబ్బేనని చెప్పుకోవచ్చు.