రాజీనామా అందుకేనా….కానీ ఇదేం కామెడీ ?

Vatti Vasanth Kumar Comedy Resignation To Congress

కాంగ్రెస్ సీనియర్ నేత వట్టి వసంతకుమార్ ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా ఉన్న ఆయన 2004, 2009లో పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. టీడీపీతో కాంగ్రెస్ అనైతిక పొత్తును నిరసిస్తూ ఆయన పార్టీకి గుడ్ బై చెప్పారు.

tdp-and-congress

1983లో టీడీపీ పెట్టినప్పటి నుంచి ఆ పార్టీతో కాంగ్రెస్ పోరాడుతోందని, అలాంటి పార్టీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు ఎలా పెట్టుకుంటుందని ప్రశ్నించారు. రెండు మూడు రోజుల్లో తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. వాస్తవానికి, ఆయన ఉండటం వల్ల కానీ.. పోవడం వల్ల కానీ కాంగ్రెస్ పార్టీకి వచ్చిందేమీ లేదు. చాలా రోజులుగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడంలేదు కూడా. రాజకీయ, సామాజిక పరిణామాలను పూర్తిగా బేరీజు వేసుకని పార్టీ మారడమే మంచిదని నిర్ణయానికి వచ్చారు. గతంలోనే ఈ మేరకు వైసీపీతో చర్చలు జరిపారు. కానీ వర్కవుట్ కాలేదు. ఇప్పుడు జనసేన వైపు చూస్తున్నారు. ఇదే టార్గెట్ గా కొద్ది రోజుల క్రితం పట్టిసీమ మీద పలు ఆరోపణలు చేశారు. మళ్ళీ బయటకు బయటకు వచ్చిన ఆయన ప్రయాణం ఎటువైపు సాగుతుందని ఇప్పుడు రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది. గతంలో ఆయన చిరంజీవి కుటుంబానికి తన మద్దతు ఉంటుందని ప్రకటించారు. అంటే, ఇప్పుడు జనసేనలో చేరతారా అనే చర్చ కూడా నడుస్తా ఉంది. పశ్చిమగోదావరి జిల్లాలో వట్టి వసంతకుమార్, చింతమనేని మధ్య ఓ సారి పెద్ద రచ్చ జరిగింది.

vatti vasanth kumar and chintamaneni

2013 నవంబర్ 26న దెందులూరులో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో వారిద్దరి మధ్య గొడవ జరిగింది. పరస్పరం కొట్టుకున్నారు. పోలీసులు ఇరువర్గాలకు సర్దిచెప్పారు. ఆ తర్వాత దానిపై కేసు కొనసాగింది. ఈ కేసులో చింతమనేనికి కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఇటీవల చింతమనేని, పవన్ కళ్యాణ్ మధ్య కూడా మాటల యుద్ధం నడిచింది. చింతమనేని రౌడీయిజం చేస్తున్నారంటూ పవన్ మండిపడ్డారు. దానికి చింతమనేని ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. ఆ రకంగా చూస్తే గతంలో చింతమనేనితో విబేధాలు ఉన్న వట్టి వసంతకుమార్ ఇప్పుడు జనసేనలో చేరే అవకాశం కూడా ఉందని అంచనా వేస్తున్నారు. అయితే, వట్టి మాత్రం తాను ఏ పార్టీలోనూ చేరబోవడం లేదని స్పష్టం చేశారు. శుక్రవారం రాత్రి మీడియాతో మాట్లాడిన ఆయన నైతిక విలువలు లేని చంద్రబాబు కాంగ్రెస్‌తో కలవడం తనను తీవ్రంగా బాధించిందన్నారు. ఈ కారణంగానే తాను కాంగ్రెస్‌ను వీడినట్టు చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికి ఏ పార్టీలోనూ చేరే ఉద్దేశం తనకు లేదన్నారు. అయితే, కొన్నాళ్ల తర్వాత మళ్లీ కాంగ్రెస్‌లోనే చేరుతానని చెబుతున్నారు కామెడీగా ? అదేమిటో మరి.