బాస్ ని ఎలా పొగడాలో ఈ బర్త్ డే లేఖ చూసి నేర్చుకోండి.

vignan college employee write birthday wishes to lavu rathaiah

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

అవసరార్ధమో, నిజమైన అభిమానమో గానీ బాస్ ని పొగిడే వాళ్ళు చాలా మంది కనబడుతుంటారు. అయితే ఈ పొగిడేవారిలో కొద్దిమంది మాత్రమే ఆ బాస్ దగ్గర మార్క్స్ కొట్టేస్తారు. మిగతావాళ్ళు షరా మామూలే. అయితే బాస్ ని ఎలా పొగడాలో తెలుసుకోవాలంటే ఈ లేఖ ఓ సారి చదవండి. విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత రత్తయ్య బర్త్ డే సందర్భంగా ఆయన దగ్గర పనిచేసే ఓ ఉద్యోగి రాసిన లేఖ రత్తయ్య మనసు దోచిందో లేదో గానీ బాస్ ని పొగడాలి అనుకునేవాళ్లు అందరికీ ఓ దారి చూపింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ లేఖ మీకోసం.

అంతట.. ఆ మహా మనిషికి పాదాభివందనం చేస్తూ నేను.., ఓటమి భారంతో పాదరసం.. ఇద్దరం కలిసి చెప్పాం ‘‘ఓ విజయ ప్రజాశక్తి, నిశీధిలో గగనవీధిలో చంద్రసమానుడా.. మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు’’]
————————-
(దొరా)
————————-
నా జీవితానికి వేగుచుక్క.. నాకు ఉద్యోగ ప్రదాత… విజ్ఞాన్‌ విద్యాసంస్థల అధినేత డాక్టర్‌ లావు రత్తయ్య గారు ఈ రోజు ఉదయాన్నే మదిలో మెదిలారు. ఈ రోజు ఆయన జన్మదినం. శుభాకాంక్షలు చెబుతూ ఓ టపా పోస్టు చేయాలని భావించాను. కనురెప్పు వాల్చాను. ఆయన నిలువెత్తు రూపం కనిపించింది. ఆ వెంటనే ఆయన ఔన్నత్యాన్ని చాటుతూ పలు పదాలు పోటెత్తుతున్నాయి. ఓ గంపెడయ్యాయి. అక్షరాల్లా వాటిని మార్చి, శుభాకాంక్షలు చెబుదామని సిద్ధమవుతుండగా.. ఎక్కడి నుంచో పరుగు తీస్తూ వచ్చింది. ఓ పాదరస బిందువు నా వద్దకు..
***
వస్తూ.. వస్తూనే అంత గొప్ప మనిషా.. మీ బాస్‌.. అంటూ నన్ను ప్రశ్నించింది. ముందు నా గురించి తెలుసుకో.. అంటూ గర్వం చూపింది. నన్ను మించిన మొనగాళ్లెవరూ లేరంటూ గేలి చేసింది. చురుకులో, మెరుపులో, తీరులో, స్వభావంలో నన్ను కొట్టినవాళ్లెవరూ భూమ్మీద లేరంటూ ప్రగల్భాలు పలికింది. నేనూ తగ్గలేదు. మా చైతన్య దీప్తి రత్తయ్య గారు.. నిన్ను మించిన అనంత శక్తి.. అంటూ గొడవకు దిగాను. వాదనలు ప్రారంభమయ్యాయి.
***
‘‘నేను చాలా అరుదుగా దొరుకుతాను.. నన్ను తయారుచేయడం కష్టం..’’ పాదరసం మొదటి మాట ఇది. నా వాదన ఇది‘‘ సిన్నబార్‌ అనే మెర్క్యరిక్‌ సల్ఫైడ్‌ను గాలిలో వేడి చేసి గంధకం భాగాన్ని తొగించడం వల్ల నిన్ను వెలికితీస్తారు. అంటే నీకంటూ ఓ ఉనికి కావాలంటే, పాదరసంగా అభివృద్ధి చెందాలంటే మరొకరిపై ఆధారపడిపోతున్నావు. కానీ మా రత్తయ్య గారు ఆయన్ను ఆయన తయారుచేసుకున్నారు. ఆయన సాధించిన అభివృద్ధి పూర్తిగా ఆయన రెక్కల కష్టం. ఆయన జీవన పయనంలో ప్రతి క్షణమూ అందుకు సాక్ష్యమే.’’
***
పాదరసం కొద్దిసేపు మౌనం వహించినట్లుగానే ఉండి మళ్లీ పొగరుగా .. ‘‘ నేను వెండిలా మెరుస్తాను. ఎవరికీ చిక్కను. దొరకను. అందుకే నాకు క్విక్‌ సిల్వర్‌ అనే బిరుదు కూడా ఉంది.’’ అంటూ రంకెలేసింది. అది విన్న నేను వెంటనే ‘‘ నువ్వు కేవలం మెరుస్తావు. అంతే మా దీక్షాదక్షుడు రత్తయ్యగారు తాను మెరుస్తూ.. మరింత మంది మెరిసేలా చేస్తున్నారు. ఆయన వద్ద పనిచేస్తున్న నాలాంటి 8 వేల మంది పొట్టపోసుకుంటూ మెరుస్తున్నారు. 40వేల మంది చదువుకుంటూ మెరిసేందుకు సిద్ధమవుతున్నారు. స్వయం మెరుపు కంటే.. మనం మెరుస్తూ.. మరింత మంది మెరిసేలా చేయడం గొప్ప కదా.. మరలాంటప్పుడు ఆయన్ను ఏ బిరుదుతో పిలవాలి..?’’ అని ప్రశ్నించాను.
***
పాదరసం మరింత బెట్టుగా.. ‘‘ నేను చాలా అరుదుగా దొరుకుతాను. సాధారణ పరిస్థితుల్లో ద్రవరూపంలో ఉండే ఏకైక లోహాన్ని నేను. తేలిగ్గా వాయురూపంలోకి కూడా వెళ్తాను. లోహాల్లో ఈ గుణం నాకే ఉంది.’’ అంటూ ఫీుంకరించింది. నేను వెంటనే ‘‘ మా రత్తయ్యగారు కూడా చాలా అరుదుగా దొరికే మనిషి. 40 ఏళ్ల కిందట మొదలైన ఆయన విద్యావ్యాప్తి పయనం ఇప్పటికీ నిరంతరాయంగా, మకుటాయమానంగా కొనసాగుతోంది. ఒంటి చేత్తో వేల కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని స్థాపించారు.. అదీ ఎంతో నైతికంగా .. ఇలాంటి వ్యక్తిని ప్రపంచంలో మరెవరినైనా చూపించగలవా..? నువ్వు సాధారణ స్థితిలోనే ద్రవరూపంలో ఉంటావేమో.. రత్తయ్య సార్‌ కరుణరూపుడు. ఏ సమయంలోనూ సంయమనం కోల్పోని అపూర్వుడు.
***
నేనో పెద్ద చురుకు, నన్నెవరూ పట్టుకోలేరు __ పాదరసం
ప్రయత్నిస్తే కచ్చితంగా నిన్ను పట్టుకోవచ్చు. కానీ రత్తయ్యగారిని ఒడిసి పట్టగలిగిన వారింకా పుట్టలేదు. నీకన్నా మా బాస్‌ పెద్ద చురుకు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ముఖ్య నగరాల్లో సంస్థలను నడిపే ఆయన వాయువేగంతో రోజుకో చోట ప్రత్యక్షమవుతుంటారు. అదీ ఆరుపదుల వయసులో. ఇది ఎవరికి సాధ్యం __ నేను
***
నేను బంగారాన్నే కరిగించగలను __ పాదరసం
కానీ నువ్వు ఇనుమును కరిగించలేవు. మా రత్తయ్య గారు ఇనుములాంటి మనిషిని సైతం ఇట్టే లొంగదీసుకోగలడు. ఎంతటి కఠినుడినైనా దారిలోకి తెచ్చుకోగలడు. ఆయన సాధించిన విజయాలే అందుకు సాక్ష్యం __ నేను
***
నాకు గణనీయమైన ఉష్ణవ్యాకోచ గుణం ఉంది. నన్ను మించిన విద్యుత్‌, ఉష్ణ వాహకం ఈ ప్రపంచంలోనే మరోటి లేదు __ పాదరసం
నువ్వు తక్కువ ఉష్ణోగ్రతకే వ్యాకోచిస్తాయి. కొంచెం ఉష్ణోగ్రత తగ్గితేనే సంకోచిస్తావు. దీనికే ఇంత పొగరా.. మా సారు ఎంత పెద్ద కష్టం వచ్చినా తలొంచరు. ఎంత పెద్ద విజయం ఎదురైనా కాలరెగరేయరు. కష్టసుఖాలు, జయాపజయాలు, లాభనష్టాలు.. సందర్భం ఏదైనా ఒకేలా ఉంటారు. కేవలం చిద్విలాసాన్నే చిందిస్తారు. నీలా చిన్న కష్టానికే ముడుచుకుపోరు. లాభం దక్కిందని విచ్చలవిడిగా నీలా విస్తరించరు. __ నేను
***
వాదనలు ఇంత వాడీవేడీగా జరుగుతున్నా.. పాదరసం తగ్గేట్టు కనబడటం లేదు. తన గురించి తాను చెప్పుకునేందుకు తన వద్ద ఏమీ లేకపోయినా.. ఇంకా బిగుసుకునే ఉంది. ఏదో చెప్పేందుకు యత్నిస్తోంది. నేను అడ్డు పడి ఇలా అన్నాను. ‘‘ ఎంత సేపటికీ నీలో గొప్ప లక్షణాలే చెబుతున్నావు. చెడు సంగతి ఏంటి? దాన్ని నువ్వు దాచాలన్నా దాగదు. నువ్వు అతి పెద్ద కాలుష్యకారిణివి. ఆరోగ్యానికి హాని కలిగించే పదార్థానివి. నీ వల్ల ఆరోగ్య సమస్యలు ఎక్కువని గ్రహించి నిన్ను చాలా దేశాలు నియంత్రిస్తున్నాయి. నీ వల్ల ‘మినిమెటా’ అనే వ్యాధి వస్తుంది. ఇది మొదటిసారిగా జపాన్‌లో వచ్చింది. మా రత్తయ్య గారు అలా కాదు. ఎవ్వరికీ ఏ కోశాన నష్టం చేయరు. ఎవరికీ అపకారి కాదు. నలుగురికీ పట్టెడన్నం పెట్టే మంచి మనిషి. నిరుపేద విద్యార్థికి ఉచితంగా చదువు చెప్పే చైతన్యమూర్తి. ఆయన ఆదర్శమూర్తి” అని నేను కుడిఎడమల వాయిస్తూ ఉంటే.. ఒక్కసారిగా పాదరసం పాదాక్రాంతమైంది. శరణు.. శరణు అంటూ అపజయాన్ని అంగీకరించింది.
***
అంతట.. ఆ మహా మనిషికి పాదాభివందనం చేస్తూ నేను.., ఓటమి భారంతో పాదరసం.. ఇద్దరం కలిసి రత్తయ్యగారి రూపును మనసులో ఒక్కసారి గుర్తు తెచ్చుకుని కలిసి చెప్పాం ‘‘ఓ విజయ ప్రజాశక్తి, నిశీధిలో గగనవీధిలో చంద్రసమానుడా.. మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు’’

 మరిన్ని వార్తలు

వెంకయ్యని చూసి మోడీ ఏడ్చాడా ?

శ్రీవారి సన్నిధిలో అధికారుల చెలగాటం

నితీష్ అంటే రగిలిపోతున్న శరద్ యాదవ్