విజయ్‌ రౌడీ వేశాలేంటో అర్థం కావడం లేదు!

Vijay Devarakonda Launch Rowdy Shirts Showroom

‘పెళ్లి చూపులు’ మరియు ‘అర్జున్‌ రెడ్డి’ చిత్రాలతో విజయ్‌ దేవరకొండ ఓవర్‌ నైట్‌ స్టార్‌ హీరో అయ్యాడు. ప్రస్తుతం ఈయన చేతిలో దాదాపు అరడజను చిత్రాలు ఉన్నాయి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే నానుడిని విజయ్‌ పక్కాగా పాటిస్తున్నట్లుగా అనిపిస్తుంది. ప్రస్తుతం తాను హీరోగా ఫాంలో ఉన్న సమయంలోనే తమ్ముడిని హీరోగా పరిచయం చేయాలని భావిస్తున్నాడు. తన వద్దకు వచ్చిన పలు కథలను తమ్ముడి కోసం కూడా పరిశీలిస్తున్నాడు. వరుసగా చిత్రాలు చేయడంతో పాటు పలు కంపెనీలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా కూడా వ్యవహరించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇక తాజాగా మరో వ్యాపారంలోకి విజయ్‌ దేవరకొండ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

మార్కెట్‌లోకి కొత్తరకం బ్రాండ్‌ దుస్తులను తీసుకు వచ్చేందుకు విజయ్‌ తన మిత్రులతో కలిసి సిద్దం అయ్యాడు. రౌడీ అనే బ్రాండ్‌తో విజయ్‌ దేవరకొండ తన బ్రాండ్‌ దస్తులను వినియోగదారుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాడు. తాజాగా రౌడీ కోసం ఒక పోస్టర్‌ను విడుదల చేయడం జరిగింది. షర్ట్‌ లేకుండా బైక్‌పై జీన్స్‌తో విజయ్‌ రైడ్‌ చేస్తున్నాడు. తనకు ఇప్పటి వరకు సరైన షర్ట్‌ లభించలేదు అంటూ పోస్ట్‌ చేశాడు. రౌడీ క్లబ్‌ అనే వెబ్‌ సైట్‌ ద్వారా విజయ్‌ తన బ్రాండ్‌ దుస్తులను అమ్మకానికి ఉంచబోతున్నట్లుగా తెలుస్తోంది. రౌడీ క్లబ్‌పై ఇప్పటికే సెలబ్రెటీలు మరియు స్టూడెంట్స్‌ ఆసక్తిగా ఉన్నారు. విజయ్‌ ప్రస్తుతం యూత్‌ ఐకాన్‌గా ఉన్నాడు. ఆ కారణంగా తప్పకుండా ఈ బిజినెస్‌ సక్సెస్‌ అవుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. జులై 15న విజయ్‌ రౌడీ క్లబ్‌ ప్రారంభం కాబోతుంది.