రానున్న రోజుల్లో చాలా కీలకంగా మారనున్న చహల్‌

రానున్న రోజుల్లో చాలా కీలకంగా మారనున్న చహల్‌

ఐపీఎల్‌ 13వ సీజన్‌లో భాగంగా సోమవారం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మధ్య జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో ఆర్‌సీబీ భోణీ కొట్టిన సంగతి తెలిసిందే. సన్‌రైజర్స్‌ను విజయం దిశగా నడిపిస్తున్న జానీ బెయిర్ ‌స్టోను 16వ ఓవర్లో బౌలింగ్‌ వచ్చిన యజువేంద్ర చహల్‌ తన మ్యాజిక్‌ బౌలింగ్‌తో బోల్తా కొట్టించాడు. ఒకే ఓవర్‌లో వరుస బంతుల్లో బెయిర్‌ స్టో(61) ను బౌల్డ్‌ చేసిన చహల్‌.. ఆ తర్వాత బంతికి విజయ్‌ శంకర్‌(0) బౌల్డ్‌ చేశాడు. ఇదే మ్యాచ్‌లో టర్నింగ్‌ పాయింట్‌గా చెప్పుకోవచ్చు. ఇక ఇక్కడి నుంచి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన సన్‌రైజర్స్‌ ఓటమి పాలయింది. మ్యాచ్‌ అనంతరం ఆర్‌సీబీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి చాహల్‌తో పాటు యువ బ్యాట్స్‌మన్‌ దేవదూత్‌ పడిక్కల్‌ను ప్రశంసలతో ముంచెత్తాడు.

‘ఈ విజయం వెనుక ఇద్దరు కీలకపాత్ర పోషించారు. ఒకరు స్పిన్నర్‌ యజువేంద్ర చహల్‌‌, మరొకరు యువ బ్యాట్స్‌మన్‌ దేవదూత్‌ పడిక్కల్. చాహల్‌ దుబాయ్‌లో జరగనున్న ఐపీఎల్‌లో చాలా కీలకమవుతాడని ముందే అనుకున్నాం.. తన లెగ్‌ స్పిన్‌ మాయాజాలంతో మ్యాజిక్‌ చేశాడు. పిచ్‌ తనకు అనుకూలంగా మారితే ఎంత ప్రమాదకారే తెలిసేలా చేశాడు. అంతవరకు మంచి ఇన్నింగ్స్‌ ఆడుతున్నబెయిర్‌ స్టోను తెలివైన బంతితో బోల్తా కొట్టించి మంచి బ్రేక్‌ అందించాడు. ఆ తర్వాత అదే ఓవర్లో విజయ్‌శంకర్‌ను క్లీన్‌బౌల్డ్‌ చేసి మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేశాడు.

తన మణికట్టు మాయాజాలంతో రానున్న రోజుల్లో చహల్‌ చాలా కీలకంగా మారనున్నాడు. ఇక బ్యాటింగ్‌లో యువ కెరటం దేవదూత్‌ పడిక్కల్‌ మొదటి మ్యాచ్‌తోనే ఒక మొమొరబుల్‌ ఇన్నింగ్స్‌ను ఆడాడు. అతని గురించి ఎంత మాట్లాడినా తక్కువే అవుతుంది. మ్యాచ్‌లో 20 పరుగులు ఎక్కువ చేశామంటే దానికి పడిక్కల్‌ కృషి చాలా ఉంది. అతనికి మంచి భవిష్యత్తు ఉంది. డివిలియర్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మిస్టర్‌ 360 అనే పేరును మరోసారి సార్థకం చేసుకున్నాడు.’ అంటూ తెలిపాడు. కాగా ఆర్‌సీబీ తర్వాతి మ్యాచ్‌ కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌తో దుబాయ్‌ వేదికగా 24న తలపడనుంది.