కాపులతో జగన్ గిల్లికజ్జాలు వెనుక తిక్కుందా, లెక్కుందా ?

what is the strategy behind jagan's kapu statement

వైసీపీ అధినేత పాదయాత్రలో ఆసాంతం సీఎం చంద్రబాబు మాత్రమే ప్రధాన టార్గెట్. కానీ గోదావరి జిల్లాల టూర్ చివరికి వచ్చేసరికి ఆయన ఇంతకుముందు లేని విధంగా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ని ఆయన చేసుకున్న పెళ్లిళ్ల గురించి ముందుకు తెచ్చారు. కార్లు మార్చినట్టు పెళ్ళాల్ని మారుస్తారని జగన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ విలువల్ని ఇంకాస్త దిగజార్చాయి. అటు పవన్ ఫాన్స్ కూడా అంతకుమించి జగన్ కుటుంబంలోని స్త్రీల గురించి సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేయడంతో సీన్ మారిపోయింది. అలా చేయొద్దని పవన్ తన ఫాన్స్ కి పిలుపు ఇచ్చిన నాలుగైదు రోజుల లోపే జగన్ కాపుల రిజర్వేషన్ అంశాన్ని ముందుకు తెచ్చారు. కేంద్రం పరిధిలో వున్న అంశం గురించి మాట్లాడి ప్రయోజనం లేదని చెప్పడం ద్వారా కాపు రిజర్వేషన్స్ అంశంలో వైసీపీ వైఖరి ఏంటో తేల్చేశారు. దీంతో జగన్ కావాలనే కాపులతో గిల్లికజ్జాలు పెట్టుకుంటున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది. అసలే ఇంకో ఏడెనిమిది నెలల్లో ఎన్నికలు. ఈ సమయంలో సంఖ్యాపరంగా ఎక్కువగా వున్న కాపులతో జగన్ ఇలా వ్యవహరించడం తిక్క వ్యవహారం అని చాలా మంది అనుకుంటున్నారు. అయితే జగన్ గిల్లికజ్జాలు వెనుక తిక్క లేదు. లెక్క వుంది. ఆ లెక్క ఏంటో చూద్దామా !

2014 ఎన్నికల్లో వైసీపీ గెలుపు తధ్యం అని పెద్ద ఎత్తున అంచనాలు వచ్చాయి. అయితే పవన్ కళ్యాణ్ రాకతో సీన్ మారిపోయిందని ఓటమి తర్వాత విశ్లేషణలో వైసీపీ నాయకులు చెప్పుకున్నారు. అలాంటిది ఇప్పుడు సీఎం చంద్రబాబుని నానాతిట్లు తిడుతున్న పవన్ ని జగన్ తనంతట తానుగా నోరు చూసుకున్నారు. కాపు రిజర్వేషన్స్ మీద కూడా అంతే. ఇది జగన్ స్వయంగా ఓ వ్యూహం ప్రకారమే చేస్తున్నారు. వైసీపీ కి ప్రధాన బలం రెడ్డి,మైనారిటీ , ఎస్సీ ఓట్ బ్యాంకు. అయితే జగన్ ఎప్పుడైతే బీజేపీ తో అంటకాగడం మొదలు అయ్యిందో ఆ ఓట్ బ్యాంకు లో చీలిక వచ్చింది. పైగా కాంగ్రెస్ కూడా ఈసారి హోదా ఇస్తామని ముందుకు వస్తోంది. ఆ పార్టీ గెలవకపోయినా ఇంతకుముందు తాను వైసీపీ కి కోల్పోయిన ఓట్ బ్యాంకు లో ఎంతోకొంత వెనక్కి తెచ్చుకుంటుంది. ఇక పవన్ రేసులో ఉండగా కాపులు వైసీపీ వైపు పెద్దగా మొగ్గు చూపరు అని జగన్ నమ్మకం. తన బలగంలో వచ్చిన ఈ చీలిక ని బాలన్స్ చేయాలంటే టీడీపీ బలాన్ని కూడా దెబ్బ కొట్టాలి. అయితే ఆ పార్టీకి వెన్నుదన్నుగా ఉంటున్న కమ్మ , బీసీ వర్గాలని ఆ పార్టీకి దూరం చేయాలి. కానీ ఇప్పుడు వున్న పరిస్థితుల్లో కమ్మల్లో చీలిక తేవడం కష్టం కాబట్టి కాపు రిజర్వేషన్ అంశాన్ని అడ్డం పెట్టుకుని బీసీలని రెచ్చగొట్టాలని జగన్ చూస్తున్నట్టు అనిపిస్తోంది. ఈ వ్యూహంతో టీడీపీ కి మద్దతు ఇస్తున్న బీసీల్లో చీలిక తో పాటు ఉత్తరాంధ్ర లో ఆ వర్గాలు పవన్ వైపు వెళ్లకుండా చూడొచ్చు. ఈ లెక్కతోటే ప్రస్తుతం జగన్ ఎవరూ ఊహించని విధంగా పవన్ వ్యక్తిగత విషయాల్ని టార్గెట్ చేసారు. ఇక ఎవరూ అడక్కుండానే కాపులకి రిజర్వేషన్ సాధ్యం కాదని గోదావరి జిల్లాల పర్యటనలో చెప్పారు.

ప్రస్తుతానికి జగన్ వ్యాఖ్యల మీద కాపుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. అదే పార్టీకి చెందిన కాపు నాయకులు ఈపాటికే తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. అయినా జగన్ ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. కానీ బీసీ వర్గాల నుంచి దీనిపై ఇంకా స్పందన రాలేదు. కాపులని దూరం చేసుకోడానికి సిద్ధపడ్డ జగన్ అంతటితో వూరుకుంటారని అనుకోడానికి వీలు లేదు. ఈ వ్యవహారంలో బీసీ లని రెచ్చగొట్టేందుకు జగన్ త్వరలోనే మాట్లాడే ఛాన్స్ వుంది. ఈ పరిణామాలు చూస్తుంటే జగన్ ప్లాన్ కొందరికి భలే అనిపించవచ్చు. ఇంకొందరికి మబ్బుల్లో నీళ్లు చూసి కుండలో నీరు ఒలకబోశారు అనుకోవచ్చు. వీటిలో ఏది నిజమో త్వరలోనే అర్ధం అవుతుంది. ఏదేమైనా రాజకీయ లెక్కలు వేసే విద్యలో ఇప్పటిదాకా జగన్ పెద్ద నిష్ణాతుడు కాదని తేలింది. అందుకే ఆయన్ని సీఎం పీఠం మీద చూడాలని కలలు కంటున్న ఉండవల్లి లాంటి వాళ్ళు సైతం ఎన్నికల వ్యూహాల్లో జగన్ సామర్ధ్యం మీద సందేహపడుతున్నారు. దానికి తగ్గట్టే ఇప్పుడే కాపు రిజర్వేషన్ అంశం మీద అభిప్రాయం చెప్పాల్సిన అవసరం జగన్ కి రాజకీయంగా ఏ మాత్రం లేదనిపిస్తోంది. అయినా ఫలితం వస్తే గానీ చేసింది తప్పో , ఒప్పో అర్ధం చేసుకోలేని జగన్ లాంటివాళ్లు గతం నుంచి పాఠాలు నేర్చుకుంటారని అనుకోవడమే భ్రమ.

                                                                                                        -అరుణాచలం.