యుద్ధం ఎవరు మొదలుపెట్టిన.. మేమే ముగిస్తాం: ఇజ్రాయెల్‌ ప్రధాని

Who started the war..we will end it: Israeli Prime Minister
Who started the war..we will end it: Israeli Prime Minister

ఇజ్రాయెల్​పై హమాస్ ముష్కరులు భీకర దాడులు చేస్తున్నారు. ఈ దాడుల్లో ఇజ్రాయెల్ పౌరులతో పాటు విదేశీయులు మృత్యువాత పడుతున్నారు. అయితే ఈ దాడులపై ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందించారు. తమ దేశంపై దాడి చేసి.. హమాస్‌ చారిత్రక తప్పిదం చేసిందన్న బెంజమిన్.. యుద్ధాన్ని ఇజ్రాయెల్‌ మొదలుపెట్టలేదు కానీ.. ముగింపు మాత్రం కచ్చితంగా ఇజ్రాయెల్ ఇస్తుందంటూ హమాస్‌కు వార్నింగ్ ఇచ్చారు.

హమాస్‌తో యుద్ధం నేపథ్యంలో దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడిన నెతన్యాహు.. దేశం యుద్ధం చేస్తోందని.. దీన్ని తాము ఏ మాత్రం కోరుకోలేదని.. కానీ, తప్పని పరిస్థితుల్లో, దేశాన్ని కాపాడుకోవాల్సిన స్థితిలో యుద్ధం చేయాల్సి వస్తోందని తెలిపారు. “మేం దీన్ని మొదలుపెట్టాలని కోరుకోలేదు. కానీ, ముగించేది మాత్రం ఇజ్రాయెలే’’ అని ఈ సందర్భంగా నెతన్యాహు అన్నారు.

ఇజ్రాయెల్‌పై దాడి చేసి హమాస్‌ చారిత్రక తప్పిదం చేసిందని.. భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఇజ్రాయెల్ ప్రతిదాడి హమాస్‌తోపాటు, తమ శత్రు దేశాలకు దశాబ్దాలపాటు గుర్తుండిపోతుందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. హమాస్‌ కూడా ఐసిస్‌ లాంటి ఉగ్రవాద సంస్థే అని.. ప్రజలంతా ఏకమై ఆ ఉగ్రవాద సంస్థను ఓడించాలని పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్‌ కేవలం తమ ప్రజల కోసమే కాకుండా.. హింసకు, అనాగరికతకు వ్యతిరేకంగా పోరాడే ప్రతి దేశం కోసం పోరాటం చేస్తుందని బెంజమిన్ నెతన్యాహు వెల్లడించారు.