రామోజీని ఎందుకు కలిశావ్…చంద్రబాబు : విజయసాయి

Eenadu-Ramoji-Rao

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీ రావును కలిసినట్టు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అమరావతి నుంచి హెలికాప్టర్‌లో ఆర్ఎఫ్‌సీకి వెళ్లిన చంద్రబాబు కీలక టీడీపీ నేతలతో కలిసి రామోజీని కలిశారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి స్పందించారు. ఏ సలహా, సహాయం కోసం రామోజీ రావుని కలిశావు చంద్రబాబూ? అని ఆయన ప్రశ్నించారు. ప్రజాధనంతో హెలికాప్టర్‌లో వెళ్లి రామోజీని కలవాల్సినంత ముఖ్యమైన పనేమిటో ప్రజలకు చెప్పే ధైర్యం ఉందా ? అని ఆయన నిలదీశారు. ‘ఓడిపోయిన తర్వాత ఎక్కడ ఆశ్రయం పొందాలో అడగడానికా ? లేక కేసీఆర్‌తో రాజీ చేయమని ప్రాధేయపడటానికి వెళ్లావా? ఇంత దిగజారిపోయావేంటి బాబూ?’ అని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు కుల మీడియా ఒక మాఫియా రేంజ్‌లో ఎదిగిన తీరు గమనిస్తే రవి ప్రకాష్‌ లాంటి వాళ్లు అనేకమంది కనబడతారని విజయ సాయి విమర్శించారు. ప్రజాధనాన్ని దోచిపెట్టడం, బ్లాక్‌ మెయిల్‌ చేసుకోమని సమాజం మీదకు వదలడం ‘40 ఇయర్స్ ఇండస్ట్రీ’ ఇన్నాళ్లుగా చేసిన ఘనకార్యమంటూ విమర్శలు గుప్పించిన ఆయన బాబు నీడలో ఈ మాఫియా దేశమంతా విస్తరిస్తోందన్నారు. తను చేయించిన 4 సర్వేల్లో టిడిపి గెలుస్తుందని తేలినట్టు చెప్పిన చంద్రబాబు ఎగ్జిట్ పోల్స్‌ను నమ్మొద్దనడం వింతగా ఉందన్నారు వైఎస్ఆర్సీపీ ఎంపీ. ‘ఏ సర్వేలను ప్రామాణికంగా తీసుకోవద్దంటే అర్థం చేసుకోవచ్చు. మీడియా ఇంతగా విస్తరించిన తర్వాత దేన్ని నమ్మొచ్చే దేన్ని పట్టించుకోకూడదో ప్రజలందరికీ తెలుస’ని విజయసాయి ట్వీట్ చేశారు. చంద్రబాబు మరో వారం రోజుల్లో మాజీ అయిపోతాడని అర్థం కావడంతో పచ్చ చొక్కాల ఇసుక మాఫియా విజృంభిస్తోందన్నారు విజయసాయి. పగలు, రాత్రి తేడా లేకుండా వాగులు, నదులను కొల్లగొడుతున్నారని ఆరోపించారు. గవర్నర్ జోక్యం చేసుకుని ప్రతి జిల్లాలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసి మాఫియాను నియత్రించాలని ఆయన కోరారు.