నా భార్య లేని జీవితం నాకు వద్దు

నా భార్య లేని జీవితం నాకు వద్దు

అనుమానాస్పద స్థితిలో భార్య మరణించింది. భవనంపై నుంచి దూకి భర్త కూడా ఆత్మహత్య చేసుకున్న సంఘటన పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుల బంధువుల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాకు చెందిన లగడపు నాగేశ్వర రావు(37), రోజా (29) దంపతులు. వీరికి అర్చక్‌ (9), భరత్‌(6) ఇద్దరు కొడుకులున్నారు. ఆరు సంవత్సరాల క్రితం నగరానికి వచ్చి బీఎస్‌ మక్తాలో నివాసం ఉంటున్నారు.

నాగేశ్వర రావు, రోజా ఇద్దరూ కూలీ పనులకు వెళ్తుండగా పిల్లలు స్థానికంగా ఉన్న సంతోషి మాతా స్కూల్‌లో ఒకరు మూడవ తరగతి, మరొకరు ఒకటవ తరగతి చదువుతున్నారు. మంగళవారం తెల్లవారు జామున సుమారు 5 గంటల ప్రాంతంలో వీరు ఉండే భవనం ఐదవ అంతస్తుకు వెళ్లిన నాగేశ్వరరావు ఎలివేషన్‌ రేలింగ్‌ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సమీపంలోనే రోజా తల్లిదండ్రులు ఉండటంతో వారు సమాచారం తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటికే నాగేశ్వరరావు మృతి చెందాడు. వీరు నివాసం ఉండే మూడవ అంతస్తుకు వెళ్లిచూడగా మంచంపై రోజా మృతి చెంది ఉండగా ఇద్దరు పిల్లలు రోజాకు అటు ఒకరు, ఇటువైపు ఒకరు పడుకుని ఉన్నారు.

రోజా మరణంపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీరికి ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేయగా నాగేశ్వర్‌రావు మేస్త్రీ పనిచేస్తుండగా, రోజా కూడా అతనితో పాటు కూలీ పనికి వెళ్లేదని, ఇద్దరూ కలిసి రోజు కనీసం రూ. 1500 వరకు సంపాదించేవారని బంధువుల ద్వారా తెలిసింది. పిల్లలను అడిగితే నాలుగు రోజులుగా తల్లిదండ్రుల మధ్య స్వల్ప ఘర్షణలు అవుతున్నట్లు అవి ఎందుకో తెలియవని చెపుతున్నట్లు తెలిసింది. కాగా రోజా బాడీపై ఎలాంటి గాయాలు లేవని పోలీసులు తెలిపారు. రోజాను చంపి భయంతో నాగేశ్వర రావు ఆత్మహత్య చేసుకున్నాడా? లేక మరే కారణమేమైనా ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.