భర్త పై అపరకాళిలా మారిన భార్య

భర్త పై అపరకాళిలా మారిన భార్య

భర్త చిత్రహింసలు భరించలేక ఓ మహిళ అపరకాళిలా మారింది. రోజూ అతడు పెట్టే బాధలు భరించలేక తీవ్రంగా కొట్టి చంపేసింది. ఢిల్లీకి చెందిన సల్మా అనే మహిళ మహిళా కమిషన్ వాలంటీర్‌గా పనిచేస్తోంది. ఆమె భర్త జావేద్ తాగుడుకు బానిసై నిత్యం భార్యను వేధిస్తున్నాడు. అతడు పెట్టే బాధలన్నింటినీ సల్మా చాలాకాలంగా భరిస్తూ వస్తోంది.

ఈ నేపథ్యంలోనే శనివారం ఫుల్లుగా తాగి ఇంటికి వచ్చిన జావేద్ భార్యతో గొడవపడి తీవ్రంగా కొట్టాడు. దీంతో రెచ్చిపోయిన సల్మా భర్తను ఒక్క తోపుతోసింది. ఇనుప రాడ్‌తో తలపై కొట్టడంతో జావేద్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. భర్త శవాన్ని బెడ్‌పై పడేసి సల్మా నిద్రపోయింది. ఆదివారం ఉదయం వారింటికి వచ్చిన జావేద్ సోదరుడు ఈ విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సల్మాను అదుపులోకి తీసుకున్నారు.

సల్మా చాలాకాలంగా భర్త వేధింపులు ఎదుర్కొంటోందని కమిషన్ ఢిల్లీ మహిళా కమిషన్ ప్రతినిధులు చెబుతున్నారు. ఆ రోజు రాత్రి ఏం జరిగిందో తమకు తెలియదని, సల్మా ఆవేశంలో తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోందని చెబుతున్నారు. మరోవైపు సల్మా తన కొడుకుని ప్లాన్ ప్రకారం చంపేసిందని జావేద్ తల్లి చెబుతోంది. భర్త అని కూడా చూడకుండా సల్మా జావేద్‌ను తరుచూ కొట్టేదని, కొద్దిరోజుల క్రితం మెట్లపై నుంచి అతడిని తోసేసిందని ఆరోపిస్తోంది.