టెక్కలిలో మహిళ దారుణ హత్య ! : కారంపొడి చల్లి…

శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో కలకలం రేగింది. టెక్కలి దగ్గరలోని జీడితోటలో మహిళ హత్యకు గురైంది. జనసంచారం లేని రహదారికి పక్కగా ఉన్న ఆ తోటలో వివాహిత మృతదేహాన్ని స్థానికులు నిన్న ఉదయం గుర్తించారు. దీంతో వెంటనే పోలీసులకి సమాచరం అందించారు. దీంతో కాశీబుగ్గ డీఎస్పీ బర్ల ప్రసాదరావు టెక్కలి, కాశీబుగ్గ రూరల్‌ సీఐలు శ్రీనివాసరావు, తాతారావు లు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహానికి సమీపంలో రక్తంతో నిండి ఉన్న పెద్ద రాయి, పగిలిన బీరు సీసాలు, కారం పొడి ప్యాకెట్టు, జేబు రూమాలు, సెల్‌ఫోన్‌ తదితర వస్తువులు పడి ఉన్నాయి. వీటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్కడ పడి ఉన్న వస్తువుల ఆధారంగా మృతురాలు సారవకోట మండలం రామకృష్ణపురం పంచాయతీ పరిధి చరణ్‌ దాసుపురం గ్రామానికి చెందిన పందిరి నీలవేణి(39)గా నిర్ధారించారు.

అందుతున్న వివరాల ప్రకారం పోలాకి మండలంలోని ప్రియాగ్రహారానికి చెందిన లక్ష్మణరావుతో సారవకోట మండలంలోని చరణ్‌దాసుపురానికి చెందిన నీలవేణితో వివాహమైంది. వీరికి చిన్నారావు, సోదులు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. లక్ష్మణరావు ప్రైవేట్‌ బస్సు క్లీనర్‌గా పనిచేస్తున్నారు. బతుకుదెరువు కోసం చరణ్‌దాస్‌పురం వచ్చి జీవిస్తున్నారు. పోలాకి మండలం ప్రియాగ్రహారంలోని బంధువుల ఇంటికి నీలవేణి ఆదివారం వెళ్లింది. సాయంత్రం చరణ్‌దాస్‌పురం బయలుదేరింది. చీకటి పడిపోవడంతో భర్త లక్ష్మణరావుకి ఫోన్‌ చేసింది. తాను కొత్తపేటలో ఉన్నానని, కురుడు గ్రామానికి ద్విచక్రవాహనంపై రావాలని సూచించింది. అమె చెప్పినట్లుగా లక్ష్మణరావు కురుడు వచ్చి నీలవేణికి ఫోన్‌ చేశారు. మొబైల్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసినట్లు రావడంతో చుట్టు పక్కల గాలించాడు. ఎంతకీ ఆచూకీ లభించకపోవడంతో సమీపంలోని కోటబొమ్మాళి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు.

అయితే మీది సారవకోట మండలం కనుక అక్కడే ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. రాత్రంతా లక్ష్మణరావుతో పాటు బంధువులు ఆమె కోసం గాలించారు. సోమవారం ఉదయం సారవకోటలో ఫిర్యాదు చేసేందుకు వెళ్లబోతున్న సమయంలో… టెక్కలి జీడితోటలో వివాహిత మృతదేహం ఉందని తెలిసింది. దీంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్న లక్ష్మణరావు… మృతదేహాన్ని పరిశీలించి తన భార్య నీలవేణిగా గుర్తించారు. అయితే ఈ కేసు మీద పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కొత్తపేట జంక్షన్‌ నుంచి కురుడు వైపు వెళ్లాల్సిన నీలవేణి పోలవరం వైపు రావడంతో పాటు మృతదేహంపై కారం చల్లడం అంటే కుక్కలు వాసన గుర్తుపట్టకుండాఉండాలనే ఉద్దేశంతో కారం చల్లారని, ప్రణాళిక ప్రకారమే చేశారని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.