అత్యంత క్రూరంగా ఒంటరి మహిళల హత్యలు

అత్యంత క్రూరంగా ఒంటరి మహిళల హత్యలు

ఒంటరి మహిళలను అత్యంత క్రూరంగా హత్యలు చేస్తున్న ముఠాను పెనమలూరు పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 12న పోరంకి సెంటర్‌లో ఉన్న కరూర్‌ వైశ్యా బ్యాంక్‌ ఏటీఎం చోరీ కేసులో నిందితుల్ని పోలీసులు పట్టుకోవడంతో వారి అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. గురువారం విజయవాడ నగర పోలీసు కమిషనరేట్‌ సమావేశ మందిరంలో సీపీ బత్తిన శ్రీనివాసులు కేసుకు సంబంధించిన విషయాలను మీడియాకు వెల్లడించారు.

పెనమలూరు మండలం పోరంకి, తాడిగడపకు చెందిన వేల్పూరి ప్రభుకుమార్, సుంకర గోపి రాజు, పొనమాల చక్రవర్తి అలియాస్‌ చక్రి, మోరం నాగ దుర్గారావు అలియాస్‌ చంటి, మద్ది ఫణీంద్రకుమార్‌లు ముఠాగా ఏర్పాడ్డారు. వీరిలో ప్రభు, చక్రి, చంటి ఆటో డ్రైవర్లు. సుంకర గోపి ఆటోపై కూరగాయల వ్యాపారం చేస్తాడు. ఫణీంద్ర పెయింటర్‌. వీరంతా చెడు వ్యసనాలకు బానిసలయ్యారు. సులభంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుని నేరాలకు పాల్పడ్డారు.

ఒంటరిగా ఉంటున్న వృద్ధులను లక్ష్యంగా చేసుకున్నారు. ఇంటికి రెండువైపులా తలుపులు ఉన్న ఇళ్లను ఎంపిక చేసుకున్నారు. అనుమానం రాకుండా అర్ధరాత్రి ఇంట్లో ప్రవేశించి సహజ మరణంలా హత్యలు చేయాలని ప్రణాళికలు రచించారు. దీంతో కుటుంబ సభ్యులకు అనుమానం రాదని, పైగా కరోనా సమయంలో చనిపోయిన వారిని త్వరగా ఖననం చేస్తారనే ఉద్దేశంతో వృద్ధులే లక్ష్యంగా ఈ తరహా నేరాలకు పాల్పడ్డారు.