ఆ సర్వే లో వైసీపీ కి 125 సీట్లు ?

Ycp lead by 125 seats Ysrcp internal survey

ఆంధ్ర ఆక్టోపస్ గా పేరుపడ్డ మాజీ ఎంపీ లగడపాటి పేరుతో ఆంధ్రజ్యోతి తాజాగా చేసిన సర్వే టీడీపీ కి 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 110 సీట్లు వస్తాయని తేల్చింది. వైసీపీ బలం 60 స్థానాలకే పరిమితం అని కూడా లగడపాటి ఆర్జీవీ ఫ్లాష్ సర్వే నిర్ధారణ. అయితే ఈ సర్వే విశ్వసనీయత మీద సందేహాలు లేకపోలేదు. దానికి ఏకైక కారణం ఆంధ్ర జ్యోతిలో రావడమే. ఆ పత్రికను టీడీపీ మద్దతుదారుగా భావించే చాలా మందికి తాజా సర్వే రుచించడం లేదు. దాని మీద నమ్మకం లేదు. అలాంటప్పుడు దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు కదా. కానీ ఎక్కడో భయం. ఇదే నిజం అవుతుందేమోనన్న భయం. జనంలోకి ఈ సర్వే వెళితే వైసీపీ బలం ఇంకా తగ్గిపోతుందేమో అన్న ఆందోళన. అందుకే ఆంధ్రజ్యోతి ప్రచురించిన సర్వేకి దీటుగా త్వరలో ఇంకో సర్వే బయటకు రాబోతోంది. అయితే ఆ సర్వే ఏ పేరుతో , ఏ సంస్థ ఆధ్వర్యంలో బయటకు వస్తుందో ఇంకా తెలియలేదు. దానిపై కసరత్తు జరుగుతోంది. ఏ సంస్థ ద్వారా ఫలితాలు వస్తే బాగుంటుంది అన్న కోణంలో విస్తృతంగా చర్చ సాగుతోంది.

అయితే పైన చెప్పిన దాని ప్రకారం ఏదో ఒక సంస్థకి సర్వే చేసే బాధ్యత ఇస్తారు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఎంపిక చేసిన సంస్థ ద్వారా జస్ట్ ఫలితాలు విడుదల చేస్తారు అంతే. అలా విడుదల అయ్యే సర్వే రిజల్ట్స్ మాత్రం ఇప్పటికే లోటస్ పాండ్ సర్కిల్స్ లో బాగా తెలిసిపోయింది.ఆ వివరాల ప్రకారం 2019 ఎన్నికల్లో వైసీపీ కి 125 స్థానాలు , టీడీపీకి కేవలం 40 స్థానాలు , జనసేనకు కేవలం 10 స్థానాలు వస్తాయట. ఆంధ్రజ్యోతికి కౌంటర్ గా వస్తున్న ఈ సర్వే చేసిందా , ఎవరైనా నలుగురు కూర్చుని చెప్పిందా అంటే సమాధానం చెప్పడం కష్టం. అయితే ఆంధ్రజ్యోతి సర్వే కి , వచ్చే సర్వే కి ఒకే ఒక్క విషయంలో ఏకాభిప్రాయం వుంది. అదేమిటంటే …రెండు సర్వేల్లోనూ జనసేన 10 లోపు స్థానాలకే పరిమితం కావడం. ఈ సర్వే బయటకు వచ్చాక జనసేన ఆధ్వర్యంలో ఇంకో సర్వే బయటకు రాకుండా ఉంటుందా ? అందులో లెక్కలు ఎలా వుంటాయో వేరే చెప్పాలా ?.