ముఖ్యమంత్రి పదవికి రాజీనామా

ముఖ్యమంత్రి పదవికి రాజీనామా

కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై సస్పెన్స్‌కు దాదాపు తెరపడింది. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్లు బీఎస్‌ యడియూరప్ప ప్రకటించారు. ఈ సాయంత్రం గవర్నర్‌ను కలిసి రాజీనామాను సమర్పిస్తానని పేర్కొన్నారు. సోమవారం రెండేళ్ల పాలన వేడుకల్లో తన నిర్ణయాన్ని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘రాజకీయ జీవితంలో ఎన్నో అగ్నిపరీక్షలు ఎదుర్కొన్నా. కర్ణాటక అభివృద్ధి కోసం చాలా చేశా. 75 ఏళ్లు దాటినా నాకు రెండేళ్ల పాటు అవకాశం ఇచ్చారు. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తా’’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.

కాగా, యడియూరప్ప వారసుడిగా లింగాయత్‌ సామాజికవర్గానికి చెందిన వారికే ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాలనేది అధిష్టానం ఉద్దేశంగా కనపడుతోంది. కర్ణాటక జనాభాలో లింగాయత్‌లు 16 శాతానికి పైగానే ఉంటారు. ఎప్పటినుంచో కమలదళానికి గట్టి మద్దతుదారులు. ఢిల్లీ పెద్దలు షార్ట్‌లిస్ట్‌ చేసిన జాబితాలో పంచమశీల లింగాయత్‌లు నలుగురు ఉన్నారు. విజయపుర ఎమ్మెల్యే బసన్నగౌడ పాటిల్, ధార్వాడ్‌ ఎమ్మెల్యే అరవింద్‌ బెల్లాద్, గనుల శాఖ మంత్రి మురుగేష్‌ నిరానీ, బస్వరాజ్‌ బొమ్మయ్‌లు ఈ నలుగురు. బసన్నగౌడ పాటిల్‌ ఆర్‌ఎస్‌ఎస్‌లో బలమైన మూలాలున్న వ్యక్తి. ఉత్తర కర్ణాటకలో పేరున్న నాయకుడు. కేంద్రమంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఆయనకు అదనపు అర్హత అవుతుందని భావిస్తున్నారు. పంచమశీల లింగాయత్‌లను బీసీలుగా గుర్తించి రిజర్వేషన్లు ఇవ్వాలని ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఉద్యమంలో కీలకభూమిక పోషించారు.

అరవింద్‌ బెల్లాద్‌ ఇంజనీరింగ్‌ చదివారు. వ్యాపారవేత్త కూడా. క్లీన్‌ఇమేజ్‌ ఉంది. బాగల్‌కోట్‌ జిల్లాలోని బిల్గి నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన మురుగేష్‌ నిరానీకి చక్కెర పరిశ్రమలు ఉన్నాయి. హోంమంత్రి అమిత్‌కు సన్నిహితుడిగా చెబుతారు. యడ్డీ తన వారసుడిగా హోంమంత్రి బస్వరాజ్‌ బొమ్మయ్‌ పేరును సిఫారసు చేసే చాన్సుంది. కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషి, బీజేపీ నేషనల్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ బీఎల్‌ సంతోష్, అసెంబ్లీ స్పీకర్‌ విశ్వేశ్వర హెగ్డే (బ్రాహ్మణ సామాజికవర్గం), సి.టి.రవి (ఒక్కళిగ)లు రేసులో ఉన్న ఇతర ప్రముఖులు. కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు నళిన్‌ కతీల్‌కు చెందిన లీకైన ఆడియో సంభాషణను బట్టి చూస్తే ప్రహ్లాద్‌ జోషి రేసులో అందరికంటే ముందున్నట్లు కనపడుతోంది.