అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం

అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం

గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలో గత అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మరో యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం స్నేహితుల దినోత్సవం సందర్భంగా నలుగురు మిత్రులు డిన్నర్‌కు కలుద్దామని ప్లాన్ చేసుకొని కొండాపూర్‌లోని ఓ పబ్‌కు వెళ్లారు. పార్టీ అనంతరం అభిషేక్, సత్య ప్రకాష్ కారు ముందు సీటులో, తరుణీ, ఆశ్రిత నెనక సీట్లో కూర్చొని తిరుగు ప్రయాణం అయ్యారు.

కొండాపూర్ మై హోమ్ మంగళ వద్ద మితిమీరిన వేగంతో కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బండ రాళ్లను ఢీకొని పల్టీ కొట్టింది.ఒక్కసారిగా కారు వెనక సీటు డోర్ తెరుచుకోవడంతో ఆశ్రిత కారులో నుంచి కింద పడిపోయింది. ఆమె తలకు తీవ్రమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన ఆశ్రిత కెనడాలో ఎంటెక్ చదువుతుందని పోలీసులు పేర్కొన్నారు. కారు నడిపిన వ్యక్తి అభిషేక్‌ అని పోలీసులు గుర్తించారు. మద్యం మత్తులో కారు నడపడం వల్లనే ప్రమాదం జరిగి ఉండవచ్చనే కోణంలో గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.