కేటీఆర్ పుట్టినరోజును ఆదర్శంగా మార్చేసిన యువ ఎమ్మెల్సీ 

Young MLC who idealized KTR's birthday

స్వంత లాభం కొంత మానుకు. పొరుగు వాడికి తోడుపడవోయి. దేశమంటే మట్టి కాదోయి. దేశమంటే మనుషులోయి అన్నాడో మహాకవి. అందుకే తమ అభిమాన నేత పుట్టిన రోజును ఈసారి వినూత్నంగా జరిపేందుకు ప్లాన్ చేసి సక్సెస్ అయ్యారు యువ ఎమ్మెల్సీ నవీన్ రావు. కేటీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని ఎమ్మెల్సీ నవీన్ రావు ఆయన మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులు ట్విట్టర్ వేదికగా ఒక వినూత్నమైన ప్రచారాన్ని ప్రారంభించారు. ‘గిఫ్ట్ ఏ స్మైల్ ఛాలెంజ్’ పేరుతో ట్విట్టర్ వేదికగా ప్రచారాన్ని చేపట్టారు. కేటీఆర్ బర్త్‌డే సందర్భంగా పూల బొకేలు, పేపర్ యాడ్స్ కాకుండా అవసరంలో ఉన్న వారికి సాధ్యమైనంత సాయం చేయాలనే సదుద్దేశంతో ఈ చాలెంజ్ ప్రారంభమైంది.

గిఫ్ట్ ఏ స్మైల్ ఛాలెంజ్ లో భాగంగా ముందు ముందు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రూ.10 లక్షల చెక్కును అంబులెన్స్ కొనుగోలు నిమిత్తం స్వచ్ఛంద సంస్థకు అందజేశారు. అక్కడితో ఆగక సైబరాబాద్  పోలీసుల నిఘానేత్రానికి కూడా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రూ.10 లక్షల చెక్కును స్పీ సజ్జనార్ కి అంధ చేశారు. శిరీష్ రావు అనే ఎన్నారై అమెరికన్ కేన్సర్ సొసైటీకి 250 యూఎస్ డాలర్లను విరాళంగా అందజేశారు. మరో ఎన్నారై శశి కనపర్తి నిశాంత్ కేన్సర్ ఫౌండేషన్ కు 500 యూఎస్ డాలర్లు విరాళంగా ఇచ్చారు. ఈ ఛాలెంజ్ ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే ప్రజలకి సాయం చేయడమే. ఒక్కొక్కరూ ఒక్కో మంచి పని చేసి ఐదుగురిని నామినేట్ చేయచ్చు. ఈ ఛాలెంజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమానికి కేటీఆర్‌ పనితీరే స్ఫూర్తి అని ఆయన అభిమానులు అంటున్నారు. కేటీఆర్ పుట్టినరోజును వాదృక్పథంతోనే నిర్వహించాలని గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమాన్ని ప్రారంభించామని అభిమానులు చెబుతున్నారు. గిఫ్ట్ ఏ స్మైల్ ఛాలెంజ్‌పై నెటిజన్లు, ప్రజలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కేటీఆర్ అభిమానులు ఏమేం చేయొచ్చటే అంగవైకల్యంతో బాధపడుతున్న వారికి అవయవాల కోసం ఆర్ధిక సాయం, రక్త దానం, అవయవదాన ప్రతిజ్ఞ, వృద్దాప్య ఆశ్రమాలు / అనాధ ఆశ్రమాలలో భోజన పంపిణీ, వృద్దాప్య ఆశ్రమాలు / అనాధ ఆశ్రమాలకు విరాళాలు, ప్రభుత్వ పాఠశాలలు / ప్రభుత్వ ఆస్పత్రుల్లో రక్షిత మంచినీటి కోసం ఆర్వో ప్లాంటులను ఏర్పాటు చేయడం, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు పుస్తకాలు/నోట్ బుక్స్ అందజేయడం, లైబ్రరీలకు పుస్తకాలను అందించడం, ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకి ఆర్ధిక సాయం, పేద ప్రజలకు వైద్యం కోసం సాయం, ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి, హరితహారం కోసం మొక్కలను నాటడం, కాలనీల్లో ఇంకుడు గుంతల ఏర్పాటు, అవసరమున్న చోట ప్రజల భద్రత కోసం సీసీ కెమెరాల ఏర్పాటు లాంటివి చేయచ్చు.

కేటీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని ట్విట్టర్ వేదికగా మొదలైన గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. ఈ కార్యక్రమం ఎంతో మంది నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతోంది.