వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ఆలోచన

వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ఆలోచన

వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మూడు రాజధానుల ఆలోచన వచ్చింది. ఆయన పెట్టుకున్న సలహాదారులు చెబితే వచ్చిందో.. ఆయన స్వయంగా ఆలోచించారో కానీ.. తన ఆలోచనను అమల్లో పెట్టడానికి ప్రాతిపదికలు కావాలనుకుంటున్నారు. ముందుగా.. అమరావతి నుంచి కార్యానిర్వాహక రాజధానిని విశాఖకు తరలించడానికి ఓ ప్రాతిపదిక కావాలనుకున్నారు. వెంటనే.. జీఎన్ రావు కమిటీ రిపోర్ట్ అందించింది. నిజానికి జీఎన్ రావు కమిటీకి నిర్దేశించిన ఎజెండా వేరు. ఆయన ఇచ్చిన నివేదిక వేరు. అందుకే జగన్ ఆలోచనకు తగ్గట్లుగా నివేదిక ఇచ్చారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఆంధ్రప్రదేశ్ నడి మధ్యలో ఉన్నందునే అమరావతి రాజధాని అని టీడీపీ చేస్తున్న వాదనకు కౌంటర్ ఇచ్చేలా.. జీఎన్ రావు కమిటీ నివేదిక ఉంది. ఒక్కచోటే అన్నీ కాదు.. అన్నీ చోట్లా అభివృద్ధి కావాలంటే.. అన్ని పాలన వికేంద్రీకరణ చేయాలని జీఎన్ రావు తేల్చారు. మరో వైపు బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూప్‌ ముఖ్యమంత్రి జగన్‌కు నివేదిక సమర్పించింది. రాజధానికి పెట్టుబడి పెట్టడం.. దండగ అని.. బీసీజీ రిపోర్ట్ ఇచ్చింది. రాజధానికి పెట్టే ఖర్చు మొత్తం గోడకు కొట్టిన సున్నమని.. తేల్చింది. ఈ కమిటీ రిపోర్ట్ ఇలా రావడానికి కూడా.. టీడీపీ చెప్పే.. ఆదాయ వనరు కాన్సెప్ట్ కు కౌంటర్ అంటున్నారు. అమరావతిని నిర్మిస్తే భవిష్యత్‌లో ఏపీకి పెద్ద ఎత్తున ఆదాయం వస్తుందని టీడీపీ నేతలు చెబుతున్నారు.

కానీ రూపాయి కూడా ఆదాయం రాదని బీసీజీ కమిటీ ద్వారా చెప్పించారు జగన్. అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అని టీడీపీ మొదటి నుంచి చెబుతోంది. అమరావతికి రుణాలిచ్చే సంస్థలకు.. తిరిగి చెల్లించడానికి ఏర్పాట్లను కూడా అమరావతి నుంచే చేసినట్లుగా గత ప్రభుత్వం లో పని చేసిన మంత్రులు రిపోర్టులు బయట పెట్టారు. అయితే.. ప్రస్తుత ఏపీ సర్కార్ మాత్రం లక్షా తొమ్మిదివేల కోట్ల ఖర్చును చూపిస్తోంది. అన్ని నిధులు లేవని.. తేల్చేస్తున్నారు. అమరావతి ఎందుకు అంటే.. టీడీపీ చెప్పే కారణాలు అయిన .. రాష్ట్రం మధ్యలో ఉండటం.. సెల్ఫ్ ఫైనాన్సింగ్, ఆదాయ వనరు వంటి వాదనలకు కౌంటర్ గా .. అవేమీ పని చేయవని.. పనికి మాలిన వాదనలని చెప్పేందుకు నిపుణుల పేరుతో జగన్ కమిటీల నివేదికలను తెప్పిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. హైపవర్ కమిటీ కూడా అదే చెప్పే అవకాశం కనిపిస్తోంది.