రోహిత్ శ‌ర్మ పేరుతో హైద‌రాబాద్ స్టేడియం

రోహిత్ శ‌ర్మ పేరుతో హైద‌రాబాద్ స్టేడియం

క్రికెట్ స్టేడియాల్లో స్టాండ్స్‌కు ఆట‌గాళ్ల పేర్లు పెట్ట‌డం మామూలే. అది కూడా మాజీ ఆట‌గాళ్ల‌కే ఈ గౌర‌వం ద‌క్కుతుంటుంది. ఐతే ఇప్పుడు భార‌త జ‌ట్టు త‌ర‌ఫున అంత‌ర్జాతీయ క్రికెట్ ఆడుతున్న స్టార్ ఆట‌గాడు రోహిత్ శ‌ర్మ పేరుతో ఒక స్టేడియ‌మే ఏర్పాట‌వుతుండ‌టం విశేషం. రోహిత్ పేరుతో స్టేడియం క‌డుతున్న‌ది అత‌డి సొంత రాష్ట్ర‌మైన మ‌హారాష్ట్ర‌లో కూడా కాదు. హైద‌రాబాద్ శివార్ల‌లో కావ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌యం.

నగర శివారులో తన పేరుతో నిర్మించనున్న స్టేడియానికి స్వ‌యంగా రోహితే శుక్ర‌వారం శంకుస్థాపన చేశాడు. ఈ కార్య‌క్ర‌మంలో రోహిత్ భార్య రితిక కూడా పాల్గొంది. ఈ స్టేడియంలోనే ట్రైనింగ్ సెంటర్ కూడా నిర్వహిస్తారు. ఆద్యాత్మిక గురువు కమలేశ్ పటేల్ (దాజీ) ఆధ్వర్యంలో చేగూరులోని కన్హ శాంతివనంలో ఈ స్టేడియాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే టీమిండియా సభ్యులను ఇక్కడికి తీసుకొస్తానని శంకుస్థాప‌న సంద‌ర్భంగా రోహిత్ తెలిపాడు.

ఐతే పూర్తి స్థాయి క్రికెట్ స్టేడియం అంటే వంద‌ల కోట్ల ఖ‌ర్చ‌వుతుంది. ఇదంత సులువైన వ్వ‌వ‌హారం కాదు. బీసీసీఐ స‌పోర్టు తీసుకుని రాష్ట్రాల క్రికెట్ సంఘాలు ఈ స్టేడియాల్ని నిర్మిస్తుంటాయి. మ‌రి ఒక ఆశ్ర‌మం నిర్వ‌హిస్తున్న వాళ్లు ఇంత భారీ ఖ‌ర్చుతో స్టేడియం నిర్మించ‌డం, దానికి రోహిత్ పేరు పెట్ట‌డం చిత్రంగా అనిపిస్తోంది.